ఇండస్ఇండ్ బ్యాంకులో మెజార్టీ వాటా కలిగిన హిందూజాలు తమ వాటాను మరింత పెంచుకుంటున్నారు. వ్యారెంటీ ఇష్యూ ద్వారా రూ.2,700 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మైక్రో లెండర్ భారత్ ఫైనాన్షియల్‌ను ఇండస్ఇండ్ విలీనం చేసుకుంటోంది. విలీన ప్రక్రియ జూలై 4న పూర్తవుతుంది. ఈ విలీనం తర్వాత వస్తున్న అతిపెద్ద పెట్టుబడి ఇది.
ప్రమోటర్లు తమ 15 శాతం వాటాను పొందేందుకు ఈ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్ట్రాటెజీ బ్యాంక్ హెడ్ సంజయ్ మాలిక్ చెప్పారు. ఈ పెట్టుబడుల్లో నాలుగో వంతు విలీనం తర్వాత వస్తుందని, మితా మొత్తం 18 నెలల తర్వాత రానుందని చెప్పారు. భారత్ ఫైనాన్షియల్ విలీనం తర్వాత ప్రమోటర్ల వాటా 13 శాతానికి తగ్గిందని, దీంతో వాటాను 15 శాతానికి పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. భారత్ ఫైనాన్షియల్ విలీనం తర్వాత ఇండస్ఇండ్ బ్యాంకు కాపిటల్ బేస్ నెట్ వర్త్ రూ.4,200 కోట్లు పెరిగింది.

ఇదిలా ఉండగా శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఉన్న రూ.1,448.70 షేర్ కంటే అధికంగా ఒక్కో షేరుకు రూ.1,709కి కొనుగోలు చేయడం విశేషం. అక్టోబర్ 2017లో హైదరాబాద్ కేంద్రస్థానంగా మైక్రో లెండర్ భారత్ ఫైనాన్షియల్‌ను విలీనం చేసుకోబోతున్నట్లు ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రకటించింది. దీంతో బ్యాంకుకు చెందిన 639 షేర్లకుగాను 1,000 షేర్స్ లభించాయి. బ్యాంకును ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే హిందుజాలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారని మాలిక్ చెప్పారు.
ఈ విలీనంతో చిన్నస్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఆర్థికంగా ప్రయోజనం లభించనున్నదని, ముఖ్యంగా 3 శాతం పాయింట్లు అదనంగా సమకూరనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 20 ఆర్థిక సేవల సంస్థలు ఉండగా, వీటిలో భారత్ ఫైనాన్షియల్ ఒకటి అన్నారు. బ్యాంకులోకి రూ.2,700 కోట్ల పెట్టుబడుల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు సోమవారం 2 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications