For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళేశ్వరం ప్రాజెక్టు: MEIL రికార్డులు, అరుదైన ఘనతలు

|

ప్రపంచంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న అతిపెద్ద ఎత్తిపోతల పధకం కాళేశ్వరంలో ప్రధానమైన లింక్ 1, 2 లోని ఎత్తిపోతల కేంద్రాలను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్‌) యుద్ధప్రాతిపదికన రికార్డు సమయం లో పూర్తిచేసింది. లింక్ 1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్ 2లోని ప్రపంచంలోని అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రాన్ని (ప్యాకేజీ 8) సిద్ధం చేసింది.ఈ పనులను రెండేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేయడం ద్వారా ఎంఇఐఎల్‌ తన శక్తీ సామర్ధ్యాలను చాటుకుంది. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీస్థాయిలో పంపుహౌస్‌ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తున్నది. రోజూ గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 120 మెషీన్‌లను (ప్రతి మెషీన్‌లోను ఒక పంపు, ఒక మోటారు వుంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్‌లను ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తుండటాన్ని బట్టి ఎంత పెద్ద స్థాయిలో పను చేస్తున్నదీ అర్ధమవుతుంది.

బాహుబలి మోటారు, రివర్స్ పంపింగ్.. రూ.80వేల కోట్ల భారీ ప్రాజెక్టు బాహుబలి మోటారు, రివర్స్ పంపింగ్.. రూ.80వేల కోట్ల భారీ ప్రాజెక్టు

22 ఎత్తిపోతల కేంద్రాల్లో...

ఈ పథకంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు అవుతూండగా అందులో 17 కేంద్రాలను మేఘా నిర్మిస్తున్నది. ఇప్పుడు మొదటి దశ కింద లింక్‌1లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లను పాక్షికంగా నీటిని పంపు చేసేందుకు సిద్ధం చేసింది. అదే విధంగా లింక్‌2 లోని ప్రపంచంలోని అతిపెద్దదయిన భూగర్భ పంపింగ్‌ కేంద్రం (పాకేజీ 8) కూడా రోజుకు 2 టిఎంసీల నీటిని పంపు చేసే విధంగా సిద్ధం చేసింది.
ఈ నె 21 శుక్రవారం కాళేశ్వరం పథకాన్ని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం వద్ద లాంఛనంగా ముఖ్యమంత్రులు ప్రారంభిస్తారు. ఇప్పటికే గోదావరి నీటిని మేడిగడ్డ పంపుహౌస్‌లోని ఫోర్‌బే లోకి తరలించారు. మోటారు ఆన్‌ చేయడం ద్వారా డెలివరీ సిస్టర్న్‌ (భూగర్భంలోని పైపు) నుంచి నీరు మళ్లీ గోదావరి లోకి అంటే ఎగువన వున్న అన్నారం బ్యారేజీ లోకి ప్రవహిస్తుంది.
అత్యంత ప్రతిష్టాత్మక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభం నేపథ్యంలో ఎంఈఐఎల్ డైరెక్టర్‌ బీ. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, " ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఇంజీనీరింగ్ అధ్బుతం. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్‌గ్రౌండ్‌ పంప్‌హౌజ్‌ ఈ ప్రాజెక్టు సొంతం.

MEIL completes work on the mega Kaleshwaram lift irrigation project

మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 6 మెషిన్లను కేవలం పది నెలల రికార్డు సమయంలో నెలకొల్పడం మరో ప్రపంచ రికార్డు. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అని అన్నారు.

ప్రపంచంలోనే తొలిసారి
ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా ఇంత భారీ స్థాయిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించనే లేదు. ఇదే తొలి అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేయాలంటే 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. మొదటి దశలో 2 టిఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్‌ వినియోగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థలో ప్రధానమైన పంపింగ్‌ కేంద్రాలను, వాటికి అవసరమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను దాదాపుగా ఎంఇఐఎల్‌ నిర్మించింది. విద్యుత్‌ వ్యవస్థకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

పంపింగ్‌ కేంద్రాల్లో సివిల్‌ పనులు రికార్డు సమయంలో పూర్తి కాగా, ఎలక్ట్రోమెకానికల్‌ అంటే మెషీన్ల ఏర్పాటు (మోటారు, పంపు) చురుగ్గా జరుగుతుండగా ఈ సీజన్‌లో నీటిని పంపుచేసేందుకు అవసరమైన మెషీన్లను ఎంఇఐఎల్‌ సిద్ధం చేసింది.
ప్రపంచంలో భారీఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్‌లోని గ్రేట్‌ మేన్‌మేడ్‌ రివర్‌ (జిఎంఎంఆర్‌) లాంటి వాటిని చెప్పుకుంటారు. అయితే వీటి పంపు సామర్ధ్యం కేవలం హార్స్‌పవర్‌లోనే ఉంది. వాటిని రెండు మూడు దశాబ్దాల సమయం తీసుకుని నిర్మించారు. ప్రపంచం మొత్తం మీద మన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తిపోతల పథకాలు 2000 తరువాత మొదలయ్యాయి. అందులో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం లాంటి పథకాలు చెప్పుకోవచ్చు. అదే సమయంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఎత్తిపోతల పథకాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. అయితే ఆ పథకంలో మెషీన్‌ 40 మెగావాట్ల సామర్ధ్యం మాత్రమే కలిగి వుంది.
దేశంలో ఎలక్ట్రోమెకానికల్‌ రంగంలో అగ్రగామిగా వున్న ఎంఇఐఎల్‌ రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఏపీలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకం

అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లో హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని 2012 లోనే పూర్తిచేసి నిరాటంకంగా దాన్ని నిర్వహిస్తున్నది. ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎత్తిపోతల పథకాలు ఎంఇఐఎల్‌ నిర్మించింది, నిర్మిస్తున్నది.
పంపుహౌస్‌ నిర్మాణంలో రికార్డులే రికార్డులు:
కాళేశ్వరం పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల్లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేస్తున్నారు. లింక్‌1లోని ఈ మూడు పంపుహౌస్‌ కిందే 1720 మెగావాట్ల విద్యుత్‌ వినియోగంలోకి వస్తోంది. అదే విధంగా ప్యాకేజీ 8లోని భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 యూనిట్లు (మెషీన్లు) ఏర్పాటు అవుతూండగా ఇప్పటికే రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 5 మెషీన్లు సిద్ధంగా వున్నాయి. ఇందులో ఒక్కొక్క మెషీన్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీ స్థాయి మెషీన్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. వీటిని బిహెచ్‌ఇఎల్‌ విడిభాగాల రూపంలో సరఫరా చేసింది. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం వుంటుంది.
బిహెచ్‌ఇఎల్‌ తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండ్రిడ్జ్‌, జైమ్‌ సంస్థలు మెషీన్లను విడిభాగాల రూపంలో సరఫరా చేశాయి. ఆ తరువాత ప్యాకేజీ 11 లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేస్తున్నది. ఆ తరువాత ప్యాకేజీ 10 లోని నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటవుతున్నాయి. ప్యాకేజీ 6 లో ఇప్పటికే ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్ధ్యం గల 7 మెషీన్లను ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చింది. అత్యధికంగా మేడిగడ్డలో 17, సుందిళ్లలో 14, అన్నారంలో 12, ప్యాకేజీ14లో 12, ప్యాకేజీ21 (రెండు స్కీము)లో 18 పంపులు ఏర్పాటు అవుతున్నాయి.
మొదటిదశలో 63 మెషీన్లు ఏర్పాటు లక్ష్యంగా ఎంఇఐఎల్‌ పనులు ప్రారంభించగా అనతికాలంలో అంటే కేవలం 2ఏళ్ల సమయంలో 33 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసింది.

అనేక అరుదైన ఘనతలు ఎంఈఐఎల్ సొంతం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ8, ప్యాకేజీ14లోని పంపుహౌస్‌లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా వున్నాయి.
సాగునీటిపథకాలు ముఖ్యంగా క్లిష్టమైన ఎత్తిపోతల పథకాలు నిర్మాణం పూర్తి కావడానికి దశాబ్దా సమయం తీసుకుంటోంది. అయినప్పటికీ కాళేశ్వరంలో పంపింగ్‌ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఎంఇఐఎల్‌ చేపట్టి రెండేళ్ల కాలంలోనే నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధం చేసింది. వీటి నిర్మాణంలో అనేక అరుదైన ఘనతలను ఎంఇఐఎల్‌ సొంతం చేసుకుంది. మేడిగడ్డ పథకానికి 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 177 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని పూర్తి చేసింది. అంటే రోజుకు సరాసరిన లక్షల ఘనపు మీటర్ల పని జరిగింది. ఇంజనీరింగ్‌ పనుల్లో ఇది ఒక రికార్డు. అదే విధంగా 22 నెలల కాలంలో 8.62 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. సరాసరిన రోజుకు 1310 ఘనపు మీటర్ల నిర్మాణం చేయడం కూడా ఎత్తిపోతల పథకాల్లో రికార్డు. 18 నెలల కాలంలో 39700 టన్నుల పైపును భూగర్భంలో ఏర్పాటు చేయడం కూడా అరుదైనదే. 10 నెలల సమయంలో 6 మెషీన్లను మేడిగడ్డలో ఆండ్రిడ్జ్‌, జైమ్‌ సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా జరగని విధంగా తక్కువ సమయంలో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది.
అదే విధంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో అన్నారం ఎత్తిపోతల పథకంలో 8 నెలల కాలంలో 115 లక్షల ఘనపు మీటర్ల మట్టి పనిని, 23 నెలల్లో 6.13 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని, 20 నెలల కాలంలో 55,853 టన్నుల పైపును ఏర్పాటు చేసే పనిని ఎంఇఐఎల్‌ పూర్తి చేసింది. ఈ పంపింగ్‌ కేంద్రంలో కూడా 6 మెషీన్లు అదే సమయంలో పూర్తయ్యాయి. ఇక సుందిళ్ల విషయానికి వస్తే 6 నెలల కాలంలో 108 లక్షల ఘనపు మీటర్ల మట్టిపనిని, 17 నెలల కాలంలో 6.34 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు పనిని పూర్తి చేసింది. 21 నెలల కాలంలో 40447 టన్నుల పైపును భూగర్భంలో అమర్చారు. 6 నెలల సమయంలో 6 మెషీన్లను పంపింగ్‌కు సిద్ధం చేసారు.

ప్రపంచంలో అతిపెద్ద నీటి పారుదల పంపింగ్ స్టేషన్

భూగర్భ ఇంజనీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ప్యాకేజీ 8 పంపింగ్‌ స్టేషన్‌
ఇది ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుదల పంపింగ్‌ స్టేషన్‌. భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించినది. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 7 యూనిట్లు కలిగిన ఈ పంపింగ్‌ స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించడం మరో అరుదైన విషయం. సాంకేతికంగా, శాస్త్రీయంగా ఇక్కడ భూమి దిగువన పంపింగ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి వచ్చింది. దీని ద్వారా రోజుకు 3 టిఎంసీల నీరు ఎత్తిపోయడం జరుగుతుంది.
ఈ పంప్‌ హౌస్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం అయింది. ఇందులో మొదటిదశలోని 5 యూనిట్లు 57,049 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రతి అంతస్తు నిర్మించగా, రెండో దశలోని రెండు (6, 7 మెషీన్లు) యూనిట్లు ప్రతి అంతస్తు 30,946 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. పంపు హౌస్‌లో ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేలు, కంట్రోల్‌ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్‌ రూం (అంతస్తు) ఒక్కొక్కటి చొప్పున వున్నాయి. అదే విధంగా ఎల్‌టి ప్యానల్స్‌, పంప్‌ ఫ్లోర్‌, కంప్రెషర్‌లు కలిపి మొత్తం 4 అంతస్తులతో నిర్మిస్తున్నారు.
ఈ పనిని ఎంఇఐఎల్‌ ఛాలెంజింగ్‌ గా తీసుకుని బిహెచ్‌ఇఎల్‌ సహకారంతో అనితరసాధ్యమనే రీతిలో మొదటి దశ పూర్తిచేసింది. బిహెచ్‌ఇఎల్‌ సరఫరా చేసిన ఈ మెషీన్లు సాంకేతికత రీత్యా అత్యధునాతనమైనవి. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా రోబోస్ట్‌ ఇంజనీరింగ్‌, సిఎఫ్‌డి (కంప్యుటేషనల్‌ ఫ్లూయీడ్‌ డైనమిక్స్‌) పరిజ్ఞానంతో ఇవి రూపొందించబడ్డాయి. భూ అంతర్భాగంలో వీటిని ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎటువంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
మొత్తం పనిలో 40 శాతం బిహెచ్‌ఇఎల్‌ వాటా.. అంటే మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయడం కాగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ 8 వద్దకు తీసుకొచ్చాక అసెంబల్‌ / ఎరక్షన్‌ చేయడం కీలకమైన 60 శాతం పనిని ఎంఇఐఎల్‌ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది.

నిర్మాణ రంగంలో 25 ఏళ్ళ అనుభవం

నిర్మాణ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రోమెకానికల్‌ పనుల్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన ఎంఇఐఎల్‌ ఈ పనిని అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని సైతం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పంపుహౌస్‌లో ప్రత్యేకత రెండు టన్నెల్స్‌ (ట్విన్‌ టన్నెల్స్‌) పక్కపక్కనే నిర్మితమవడం. వీటిని కుడి ఎడమ టన్నెల్స్‌గా పిుస్తుంటారు. 10.5 మీటర్ల వ్యాసంతో వీటిని తొలిచి నిర్మించారు. ఒక్కొక్కటి 4,133 మీటర్ల పొడవున వున్నాయి. వీటి లైనింగ్‌ తదితర పనులు కూడా పూర్తయ్యాయి.
పంపుహౌస్‌తోపాటుగా ఇందులోని సర్జ్‌పూల్‌, అడిషనల్‌ సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే అతిపెద్దవి. పైగా భూగర్భంలో ఇలా నిర్మించడం ఇదే తొలిసారి. పంపుహౌస్‌ పరిమాణం 330 మీటర్ల లోతు, 25 మీటర్ల వెడల్పు, 65 మీటర్ల ఎత్తులో వుందంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. పంపు చేయడానికి అవసరమైన నీరు సర్జ్‌పూల్‌కు చేరుతుంది. ఇక్కడ భారీ పరిమాణంలో నీరు వుండాలి. అందుకు తగిన విధంగా 3 సర్జ్‌పూల్స్‌ నిర్మించారు. 200x20x67.8 మీటర్ల పరిమాణంతో ప్రధాన సర్జ్‌పూల్‌ నిర్మాణం పూర్తయింది. అదనపు సర్జ్‌పూల్‌ నిర్మాణం 60x20x69.5 మీటర్ల సామర్ధ్యంతోను పూర్తి చేశారు. 2వ దశ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం 189.5 మీటర్ల దిగువన 115x25x64.75 మీటర్ల పరిమాణంతో పని పూర్తయింది. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేను కూడా ప్రత్యేకంగా కింది భాగంలో నిర్మించారు. పంపుహౌస్‌ దిగువభాగం.. అంటే నేలభాగం గ్రౌండ్‌లెవెల్‌ నుంచి 330 మీటర్ల దిగువకు ఉండటం ఒక ప్రత్యేకత. వర్టికల్‌ పంపును 138 మీటర్ల దిగువన ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. ప్రతి పంపు మోటారూ బరువు 2,376 మెట్రిక్‌ టన్నులు ఉందంటే ప్రతీ యూనిట్‌ ఎంత పెద్దదో చెప్పాల్సిన పని లేదు.
అరుదైన విద్యుత్‌ వ్యవస్థ:
రోజుకు 3 టిఎంసీల నీటిని పంపు చేసేందుకు గరిష్టంగా 7152 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల మొత్తం విద్యుత్‌ డిమాండే అంత వుంటున్నదంటే ఈ పథకం ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మొదటిదశలో రెండు టిఎంసీల నీటినిసరఫరా చేసేందుకు 4992 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3057 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, అందులో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లను 3057 మెగావాట్ల సామర్ధ్యం మేర ఎంఇఐఎల్‌ నిర్మించింది. తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంత పెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనతికాలంలోనే అంటే రెండేళ్ల వ్యవధిలో ఇంతపెద్ద విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఇఐఎల్‌ మరో రికార్డు అధిగమించింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 37.08 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చు. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తవుతుంది.

English summary

కాళేశ్వరం ప్రాజెక్టు: MEIL రికార్డులు, అరుదైన ఘనతలు | MEIL completes work on the mega Kaleshwaram lift irrigation project

Megha Engineering and Infrastructure Limited (MEIL) has completed the construction of the Kaleshwaram Lift Irrigation project on the Godavari river.
Story first published: Wednesday, June 19, 2019, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X