న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్‌లలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ రెండో స్థానంలో, సోనీ ఇండియా మూడో స్థానంలో నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR)-2019 తన సర్వేను సోమవారం విడుదల చేసింది. అమెజాన్ ఇండియాకు ఆర్థిక బలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించడంలో ముందు ఉంది.

టాప్ 10 ఆకర్షణీయ బ్రాండ్లు ఇవే..
టాప్ 10 ఆకర్షణీయ బ్రాండ్స్‌లో వరుసగా అమెజాన్ ఇండియా,(1) మైక్రోసాఫ్ట్ (2), సోనీ (3), మెర్సిడెజ్ బెంజ్ (4), ఐబీఎం (5), లార్సెన్ అండ్ టర్బో (6), నెస్లే (7), ఇన్ఫోసిస్ (8), శాంసంగ్ (9), డెల్ (10) ఉన్నాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఇండియాను గత ఏడాది హాల్ ఆఫ్ ఫేమ్ విభాగంలోకి చేర్చారు. వరుసగా మూడేళ్ల పాటు ముందు నిలిచినందుకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.

వేతనానికి ప్రాధాన్యత
భారతీయ ఉద్యోగులు కంపెనీని ఎంచుకునే సమయంలో తొలి ప్రాధాన్యతను వేతనానికి ఇచ్చారు. వేతనం తర్వాత ఉద్యోగి బెనిఫిట్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, జాబ్ సెక్యూరిటీ గురించి ఆలోచించారు. కంపెనీ బ్రాండింగ్ అనేది నైపుణ్యం ఉన్న ఉద్యోగులు కోరుకుంటున్న కంపెనీలకు, మరోవైపు ఉద్యోగుల లక్ష్యాలకు మద్దతు పలికే కంపెనీలను కోరుకునే సిబ్బందికి చాలా కీలకంగా మారిందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ అండ్ సీఈవో పాల్ డ్యూపీస్ అన్నారు.

ఏ రంగం వైపు ఎంత మంది మొగ్గారంటే
ఎక్కువ మంది ఇండియన్స్.. 55 శాతం మంది మల్టీ నేషనల్ కంపెనీలు (MNC) పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. స్టార్టప్‌లలో పని చేసేందుకు కేవలం 9 శాతం మంది మాత్రమే మొగ్గు చూపుతున్నారని తేలింది. మల్టీ నేషనల్ కంపెనీలలో అయితే జాబ్ సెక్యూరిటీ, ఆర్థిక బలం, కెరీర్ ప్రోగ్రెస్ వంటి అవకాశాలు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం సెక్టార్‌లో పని చేసేందుకు 67 శాతం మంది, రిటైల్, ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్ సంస్థల్లో పని చేసేందుకు 67 శాతం మంది, ఆటోమొబైల్స్ వైపు వెళ్లేందుకు 66 శాతం మంది, బీఎఫ్ఎస్ఐ వైపు 65 శాతం మంది మొగ్గు చూపారు.


Click it and Unblock the Notifications