త్వరలో కొత్త టోల్ పాలసీ: ఆ కార్లకు దెబ్బ, వాహనదారులకు గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలో కొత్త టోల్ పాలసీతో ముందుకు రానుందని తెలుస్తోంది. జాతీయ రహదారుల కోసం ప్రస్తుతం ఉన్న టోల్ రేట్లను సవరించడం, వెహికిల్స్ టైప్‌ను వర్గీకరిస్తూ కొత్త విధానంతో కేంద్రం ముందుకు రావొచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు అమలులో ఉన్న మొత్తం టోల్ వ్యవస్థను సమూలంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

త్వరలో సరికొత్త టోల్ వ్యవస్థ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)తో కలిసి ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను చక్కబరిచేందుకు కొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించే పనిని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. టోల్ రేట్లను సవరించడంతో పాటు వాహనాల పునర్వర్గీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవస్థను అంతకుముందు 2008లో సవరించారు. ఇప్పుడు మళ్లీ కేంద్రం సవరించాలని చూస్తోంది.

ప్రయివేటు కార్లకు టోల్ దెబ్బ
సవరణల్లో భాగంగా ప్రయివేటు కార్ల టోల్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం డ్రాఫ్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నామని, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో టోల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, అదే సమయంలో సరకు రవాణా వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల సరకు రవాణా టోల్ ధరలు తగ్గించి, ప్రయాణీకుల వాహనాల టోల్ ధరలు పెంచాలని BCG సూచించినట్లుగా సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ డ్రాఫ్ట్‌కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం కోరనున్నారని చెబుతున్నారు.

ఆ తర్వాత కేబినెట్ ఆమోదం
దేశ ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సవరించే ఈ టోల్ రేట్ల వల్ల కారు యూజర్లు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడితే అది రాజకీయంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. BCG తయారు చేస్తున్న డ్రాఫ్ట్ NHAI వద్ద క్లియరెన్స్ పొందిన తర్వాత కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుందని చెబుతున్నారు.

వాహనదారులకు శుభవార్త
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై 'పే యాజ్ యు యూజ్'ను కూడా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. అంటే మీరు ఎంత వరకు ప్రయాణిస్తారో దానికి మాత్రమే చెల్లించేలా వాహనదారుడికి లబ్ధి చేకూరేలా కొత్త పద్ధతిని తీసుకు రానుంది. ప్రస్తుతం ఓ టోల్ సెంటర్ నుంచి తదుపరి టోల్ సెంటర్ వరకు ప్రయాణించినా, ప్రయాణించకపోయినా మొత్తం రుసుము వసూలు చేస్తారు. ఇప్పుడు అలా కాకుండా ఎన్ని కిలో మీటర్లు ప్రయాణిస్తారో అంత దూరం మాత్రమే చెల్లించే విధానాన్ని తీసుకు రావాలని చూస్తోంది. ఇది వాహనదారులకు ఎంతో గుడ్‌న్యూస్. 208-19 కేంద్ర బడ్జెట్‌లో నాటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దీనిపై ప్రకటన చేశారు.


Click it and Unblock the Notifications