హైబ్రిడ్ డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీ, జొమాటో టెస్ట్ సక్సెస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో డ్రోన్ డెలివరీ టెస్ట్‌ను నిర్వహించింది. ఇది విజయవంతమైంది. హైబ్రిడ్ డ్రోన్‌ను ఉపయోగించి ఈ ప్రయోగం చేసింది. ఈ విషయాన్ని జొమాటో సంస్థ ప్రతినిధులు బుధవారం వెల్లడించారు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్టమర్‌కు హైబ్రీడ్ డ్రోన్ ద్వారా పది నిమిషాల్లో ఫుడ్‌ను డెలివరీ చేసే పరీక్షను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
ఆ డ్రోన్ గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణించిందన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఒక రిమోట్ సైట్ ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని చేసినట్లు తెలిపింది. ఇలాంటి పరీక్షలు చేసేందుకు ఆ రిమోట్ సైట్ రూపకల్పన చేశారన్నారు. అయితే ఈ ప్రయోగం చేసిన ప్రాంతాన్ని వెల్లడించలేదు.
డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీతో సమయం ఆదా అవుతుందని, అలాగే వేగవంతంగా డెలివరీ అవుతుందని వారు చెప్పారు. రోడ్డు మార్గంలో డెలివరీ చేస్తే చాలా సమయం పడుతోందని చెప్పారు. డ్రోన్ల ద్వారా చేస్తే త్వరగా వినియోగదారుడికి అందుతోందన్నారు. డ్రోన్ల ద్వారా డెలివరీ కోసం తాము సురక్షితమైన టెక్నాలజీ దిశగా పని చేస్తున్నామన్నారు.

కాగా, జొమాటో లక్నోకు చెందిన డ్రోన్ స్టార్టప్ టెక్ఈగిల్‌ను అక్వైర్ చేసుకున్న విషయం తెలిసిందే. డెలివరీ సమయాన్ని, త్వరితమైన డెలివరీ కోసం దీనిని తీసుకుంది. డ్రోన్ సేవల ద్వారా పొల్యూషన్ ఉండకపోవడంతో పాటు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కూడా తప్పుతాయి.
డీజీసీఏ అప్రూవ్ చేసిన రిమోట్ సైట్‌లో ఈ హైబ్రిడ్ డ్రోన్‌ను గత వారం పరీక్షించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి పరీక్షల కోసమే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణంగా జొమాటో డెలివరీ యావరేజ్ టైమ్ 30 నిమిషాలుగా ఉంది. కొన్ని సందర్భాల్లో 40 నిమిషాలు కూడా ఉంది. ఇది పదిహేను నిమిషాలు తగ్గనుందని చెప్పారు. డ్రోన్ ద్వారా ఫుడ్ డెలివరీ త్వరలో నెరవేరబోతుందన్నారు.
ప్రస్తుతం యావరేజ్ ఫుడ్ డెలివరీ టైమ్ 30.5 నిమిషాలుగా ఉందని, ఏరియల్ రూట్ ద్వారా దీనిని 15 నిమిషాలకు తగ్గిస్తామని, ఫాస్ట్ డెలివరీకి రోడ్లు సరైన మార్గం కాదని, అందుకే సురక్షితమైన, సులభమైన డెలివరీ టెక్నాలజీతో ముందుకు వెళ్తామని జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపిందర్ గోయల్ అన్నారు.


Click it and Unblock the Notifications