రూ.100 కోట్ల గోల్‌మాల్: లిక్కర్ బరాన్ తనయుడు మోంటీ చద్దా అరెస్ట్
న్యూఢిల్లీ: లిక్కర్ బరాన్ పాంటీ చద్దా తనయుడు, వేవ్ గ్రూప్ వైస్ చైర్మన్ మోంటీ చద్దాను ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.100 కోట్ల కుంభకోణం కేసులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేశారు. థాయ్‌లాండ్‌లోని ఫుకేత్‌కు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరలో ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి వినియోగదారులను మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
మోంటీ చద్దా అలియాస్ మన్‌ప్రీత్ సింగ్ చద్దా ఉప్పల్-చందా హైటెక్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ డైరెక్టర్. వేవ్ గ్రూప్ వైస్ చైర్మన్. ఇతను ఫ్లాట్లను అతి తక్కువ ధరకు ఇస్తానని ప్రజలను నమ్మించి రూ.100 కోట్ల మేర మోసం చేశాడు. ఢిల్లీ పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలువురు కుటుంబ సభ్యులకు, ఉద్యోగులను 2018లో పోలీసులు అఱెస్ట్ చేశారు.

మోంటీ చద్దాను తము గురువారం రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (EOW) సువాషిష్ చౌదరీ అన్నారు. మోంటీ చద్దాతో పాటు పలువురు వేవ్ గ్రూప్‌కు చెందిన ప్రమోటర్లకు ఈ కేసు విషయమై 2018లో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
రోజ్ వుడ్ ఎన్‌క్లేవ్, సన్నీవుడ్ ఎన్‌క్లేవ్, లైమ్‌వుడ్ ఎన్‌క్లేవ్ తదితర టౌన్‌షిప్ పేర్లతో ఇళ్లు కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్న వారిని ఆకర్షించాడు. ఇళ్ళు, విల్లాలు గోల్ఫ్ కోర్స్, హెలిపాడ్స్, ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, షాపింగ్ మాల్స్ తదితర అత్యాధునిక సదుపాయాలని చెబుతూ మభ్య పెట్టాడు. కానీ ప్లాట్లను వారికి కేటాయించడంలో విఫలమయ్యారనేది ఆరోపణ. కాగా ఆస్తుల వివాదంలో 2012లో మోంటీ చద్దా తండ్రి పాంటీ చద్దాను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అప్పటి నుంచి తండ్రి బాధ్యతలు మోంటీ చద్దా చేపట్టారు.


Click it and Unblock the Notifications