న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్‌లో విప్లవం తీసుకువచ్చిన ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం సంస్థ తన పేటీఎం క్యూఆర్ సేవలను నాలుగు ఐదవ శ్రేణి నగరాలకు విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో పేటీఎం 20 మిలియన్ మంది మర్చంట్‌లకు అందుబాటులోకి రానుంది. అదికూడా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే జరుగుతుందని పేటీఎం తెలిపింది.
పేటీఎం QR స్కానింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా దుకాణాదారుడి బ్యాంకు ఖాతాలోకే నేరుగా డబ్బులు జమ అవుతుంది. వినియోగదారుడు పేటీఎం QR కోడ్‌ను స్కాన్ చేస్తే తాను కొనుగోలు చేసిన వస్తువుకు డబ్బులు నేరుగా దుకాణాదారుడి బ్యాంకు ఖాతాలోకి పడిపోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మంది మర్చంట్‌లు పేటీఎం QR కోడ్‌కు ఓకే చెప్పి వారి దుకాణాల్లో దీన్ని ఉంచుతున్నారు. అయితే పేటీఎం QRలు ఎక్కువగా పెద్ద నగరాలు పట్టణప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక చిన్న టౌన్లు అయిన అజ్మీర్, బెకగావ్, కర్నూలు, రోహతక్, లాతూరు లాంటి చిన్న పట్టణాలకు కూడా విస్తరించాలని యాజమాన్యం భావిస్తోందని పేటీఎం సంస్థ వైస్ ప్రెసిడెంట్ దీపక్ అబ్బోట్ తెలిపారు.

నాలుగు ఐదవ శ్రేణి పట్టణాల్లో 60శాతం పైగా మర్చంట్‌లను పేటీఎం పరిధిలోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇక దీర్ఘకాలంలో 20 నుంచి 30 మిలియన్ మంది మర్చంట్లకు చేరువయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపింది. దేశ మారుమూల గ్రామాల్లో కూడా ఒక డిజిటల్ విప్లవం తీసుకొస్తామని దీపక్ తెలిపారు. పేటీఎం QR అన్ని రకాల డిజిటల్ పేమెంట్లను అంగీకరిస్తుందని చెప్పారు. యూపీఐ, వాలెట్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌లతో పేటీఎంకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని దీపక్ స్పష్టం చేశారు.
ఇక నేషనల్ పెన్షన్ సిస్టం (NPS)అమలుకు కావాల్సిన అన్ని అనుమతులు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి లభించాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ సర్వీసుల ద్వారా పేటీఎంలో నమోదైన ఖాతాదారులు ఎన్పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చని వెల్లడించింది.


Click it and Unblock the Notifications