హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. దురుద్దేశ్యంతో ప్రభుత్వం తనను వెంటాడుతోందని వ్యాఖ్యానించారు. టీవీ9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ.60 కోట్లు వచ్చాయని, ప్రస్తుతం టీవీ9లో వాటాను విక్రయించిన సమయంలోను హవాలా మార్గాల్లోనే నిధులు తరలించారని ఆరోపించారు. ఉగ్రవాదులకు నిధులను తరలించే మార్గాల్లో ఈ నిధులు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాఫ్తు చేయాలని తాను ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచే తనను తెలంగాణ ప్రభుత్వం వెంటాడుతోందన్నారు. తనపై తప్పుడు కేసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. రవిప్రకాశ్ తరఫున ప్రముఖ లాయర్ దిల్జీత్ సింగ్ అహ్లూవాలియా వాదనలు వినిపించారు.

హవాలా మార్గంలో రూ.294 కోట్లు
రవిప్రకాశ్‌ను 40 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారని, ఇంకా వారికి ఏం చెప్పాలని లాయర్ అడిగారు. వారికి నచ్చింది చెప్పేదాకా వేధిస్తారని ఆరోపించారు. టీవీ9లో రవిప్రకాశ్ వాటా 10 శాతమని, గత పదిహేనేళ్లుగా ఆయన సీఈవోగా ఉన్నారన్నారు. మిగతా 90 శాతం వాటా కొనుగోలు విషయంలో రూ.500 కోట్లకు రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఇందులో రూ.294 కోట్లు ఇచ్చారని, ఇది హవాలా మార్గంలో తరలించారని ఆరోపించారు. మిగతా రూ.206 కోట్లు చెక్కు ద్వారా ఇచ్చారన్నారు. 2008లో ఇలాగే పెట్టుబడులు వచ్చాయన్నారు.

ఆదేశాలు అమల్లో ఉండగా షేర్ల బదలీ ఏలా?
సైఫ్ మారిసిష్ కంపెనీ 2018 ఫిబ్రవరి 8న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో రూ.350 కోట్లకు కేసు వేసిందని, ఈ కేసులో ఎన్సీఎల్టీ స్టే ఆదేశాలు ఇచ్చిందని, అయితే ఈ స్టే ఆదేశాలు అమలులో ఉండగానే షేర్స్ బదిలీ పూర్తి చేశారని, ఎన్సీఎల్టీ ఆదేశాలకు భిన్నంగా వాటాలు బదిలీ అయ్యాయని, అయినా సైఫ్ మారిసిష్ సంస్థ మౌనంగా ఉందని, రహస్య ఒప్పంద మేరకే అలా వ్యవహరించిందని రవిప్రకాష్ తరఫు లాయర్ ఆరోపించారు.

పోలీసులు ఏం చెప్పారంటే
ఇదిలా ఉండగా, టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్లో తన వాటా 40,000 షేర్లను శివాజీకి విక్రయించినట్లు రవిప్రకాశ్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని పోలీసుల తరఫు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 2018 ఫిబ్రవరిలో వాటాలను విక్రయించినట్లు రవిప్రకాశ్ చెబుతున్నారని, అదే వాస్తవమైతే వాటిని రికార్డుల్లో చూపాలన్నారు. ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్‌లో ఈ సొమ్ము గురించి రవిప్రకాష్, శివాజీ ఇద్దరూ చూపలేదని తెలిపారు. ఫోర్జరీ ద్వారా తప్పుడు పత్రాలతో వాటాల విక్రయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు. టీవీ 9 లోగోను, బ్రాండ్ పేరును రవిప్రకాశ్ అక్రమంగా విక్రయించారని, దీనికి వాటాదారుల అనుమతి లేదన్నారు. మీడియా నెక్స్ట్‌కు నిధుల్ని అక్రమంగా తరలించారని చెప్పారు. శివాజీకీ కూడా నోటీసులిచ్చామని, దానికి స్పందించలేదని చెప్పారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేయరాదని చెప్పారు. అనంతరం విచారణ మంగళవారానికి వాయిదా పడింది.


Click it and Unblock the Notifications