రూ.50 కోట్ల టర్నోవర్‌కు ఇ-ఇన్వాయిస్, ఈ ఇక్కట్లు తప్పినట్టే!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఈ నెల 20వ తేదీన సమావేశం కానుంది. ఈ సందర్భంగా బిజినెస్ టు బిజినెస్ (B2B) అమ్మకాల కోసం కేంద్రీకృత ప్రభుత్వ పోర్టల్‌పై ఈ-ఇన్వాయిస్ పొందడానికి టర్నోవర్ పరిమితిని రూ.50 కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం ఈ-ఇన్వాయిస్ జారీ కోసం టర్నోవర్ పరిమితిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

జీఎస్టీ ఎగవేత, పన్ను ఎగవేతల నిరోధించే ఛాన్స్
B2B విక్రయాలకు సంబంధించి రూ.50 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలే ఈ-ఇన్వాయిస్‌లు రూపొందించడానికి అవకాశం కల్పించేలా ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జీఎస్టీ ఎగవేతలను అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. దీనిని అమలులోకి తీసుకు వస్తే పన్ను ఎగవేతలను నిరోధించే అవకాశముందని చెబుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలైన రిటర్స్స్ ప్రకారం రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన వ్యాపారవేత్తలు 68,041 మంది ఉన్నారు. 2017-18 మొత్తం జీఎస్టీ చెల్లింపులకు అన్వయించుకుంటే వీరి టర్నోవర్ వాటా 66.6 శాతంతో సమానం.

ఇన్వాయిస్ అప్ లోడ్ చేసే పని తప్పుతుంది
ఇందులో రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు దీనికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. B2B విక్రయాలకు సంబంధించి ఆ సంస్థలు ఇ-ఇన్వాయిస్ రూపొందించాల్సి ఉంటుంది. కేంద్రీకృత పోర్టల్‌కు అనుసంధానమైన వ్యాపారులు ఇకపై ఇన్వాయిస్‌లు అప్ లోడ్ చేసే పని తప్పుతుంది. అలాగే, రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇన్వాయిస్ దుర్వినియోగం, జీఎస్టీ ఎగవేతలను నిరోధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20న జరిగే జీఎస్టీ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

ఇ-ఇన్వాయిస్
ఇ-ఇన్వాయిస్ సిస్టంను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అమలులోకి తీసుకు వచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. డేటా ఎనాలసిస్ ప్రకారం రూ.50,000 విలువ కలిగిన 3.9 కోట్ల B2B ఇన్వాయిస్‌లు ప్రతి నెల జనరేట్ అవుతున్నాయని చెబుతున్నారు. అంటే రోజుకు రూ.12 లక్షల ఆదాయం. మొత్తానికి జీఎస్టీ కౌన్సెల్ ఈ నెల 20వ తేదీన సమావేశమై ఇ-ఇన్వాయిస్ పైన తుది నిర్ణయం తీసుకోనుంది.


Click it and Unblock the Notifications