హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన విచారణకు సహకరించడం లేదనే కారణాలతో అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను అరెస్ట్ చేస్తారా.. లేదా అనే అంశం సోమవారం (10 జూన్) తేలిపోనుంది. ఎందుకంటే పోలీసులు సోమవారం నాడు కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు.
ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆయనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో ఆయన సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం, దాటవేత ధోరణి అవలంబించడం చేసినట్లుగా తెలుస్తోంది. ఇవే అంశాలతో పోలీసులు నివేదిక సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఈ నివేదికను వారు ఈ రోజు కోర్టుకు సమర్పించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ పరిణామాలను చూస్తుంటే ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోన్నట్లుగా కనిపిస్తోంది.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీబీ వై శ్రీనివాస్ కుమార్ ఈ కేసు గురించి మాట్లాడుతూ... జూన్ 4, 5, 6 తేదీల్లో రవిప్రకాశ్‌ను విచారించామని, కానీ ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అంతకుముందు తమ విచారణలో పలు ఆధారాలు గుర్తించామని, ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయని అలాగే, సాక్ష్యుల వాంగ్మూలాలు ఉన్నాయని చెప్పారు. వీటిని పరిశీలించిన మీదట రవిప్రకాశ్, తదితరులపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదనేందుకు రవిప్రకాశ్ కొన్ని డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేయాలన్నారు. అతని ఇంట్లో సోదాలు జరిపి పలు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌లు సేకరించామని, అలాగే, ఈ కేసుకు సంబంధించి పలువురిని ప్రశ్నించామని చెప్పారు. ఆయన కొన్ని పత్రాలు సృష్టించినట్లుగా తేలిందన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను రవిప్రకాశ్ కొట్టి పారేస్తున్నారని, కానీ ఆధారాలు మాత్రం ఆయననపై ఆరోపణలు నిరూపిస్తున్నాయని చెప్పారు. విచారణ ముగిసిందని, ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. తదుపరి విచారణకు లేదా తదుపరి చర్యలకు అనుమతి కోరుతామని చెప్పారు.


Click it and Unblock the Notifications