19 లక్షల SUV కారు... రూ.2 లక్షలకే ఎత్తుకెళ్లాడు!
SUV కారు కేవలం రూ.2 లక్షలకే వస్తుందా? కానీ చోరకళలో ఆరితేరిన ఓ వ్యక్తి మాత్రం బెంగళూరులో నిస్సాన్ షోరూం లోనికి వెళ్లి డౌన్‌పేమెంట్‌గా రెండు లక్షల రూపాయల మొత్తం చెల్లించి, కారుతో ఉడాయించాడు. ఈ కారు ధర సుమారు రూ.19 లక్షలు. కానీ అతను మాత్రం మినిమం అమౌంట్ చెల్లించి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నిస్సాన్ షోరూం నుంచి కారు ఎత్తుకెళ్లాడు
కస్టమర్ పేరు థామస్ అలియాస్ జోసెప్. ఇతను నిస్సాన్ షోరూంలోకి వచ్చి ఎస్‌యూవి కారు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. డౌన్‌పేమెంట్‌గా రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ తర్వాత తాను కారు పర్‌ఫార్మెన్స్ చూస్తానని, టెస్ట్ డ్రైవ్ కోసం అనుమతి ఇవ్వాలని షోరూం యాజమాన్యాన్ని కోరాడు. అయితే ఆ కారును తీసుకెళ్లిన జోసెప్ తిరిగిరాలేదు. నాలుగు నెలలుగా అతను కనిపించకుండానే పోయాడు.

HALలో ఫిర్యాదు
ఈ సంఘటన జనవరి 23వ తేదీన బెంగళూరు నగరం దొడ్డనెకుండిలోని సూర్య నిస్సాన్ షోరూంలో జరిగింది. ఈ మేరకు షోరూం మేనేజర్ HAL పోలీస్ స్టేషన్‌లో మే 21వ తేదీన ఫిర్యాదు చేశారు. కారు మిస్ అయిన దాదాపు నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును గత గురువారం నాడు HAL పోలీసులు మహదేవపుర పోలీస్ స్టేషన్‌కు బదలీ చేశారు.

కంప్లయింట్‌లో ఏం చెప్పారంటే?
ఈ మేరకు షోరూం మేనేజర్ గణేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 23న జోసెప్ అనే వ్యక్తి సాయంత్రం ఆరున్నర గంటలకు వచ్చాడని, రూ.18.6 లక్షల SUV కారుకు గాను డౌన్‌పేమెంట్‌గా రూ.2 లక్షలు చెల్లించాడని, ఆ తర్వాత ట్రయల్స్ కోసం వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కారు ట్రయల్స్ కోసం వెళ్తానని చెప్పి ఈ రోజు వరకు అతను తిరిగి రాలేదని, అతనికి ఫోన్ చేసినా తీయడం లేదని, అతను ఇచ్చిన ఆఫీస్ చిరునామాకు వెళ్తే అక్కడా లేడని పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణను ప్రారంభించారు.


Click it and Unblock the Notifications