ఆ కరెన్సీ మీ దగ్గర ఉంటే జైలుకే...
అదేంటి కరెన్సీ ఉంటే జైలుకు ఎందుకు పంపిస్తారు అన్న సందేహం మీకు వచ్చి ఉంటుంది కదా... అవును నిజమే ఆ కరెన్సీ ఉంటే జైలుకు వెళ్లక తప్పదు. అది కూడా ఒకటో రెండో సంవత్సరాలు కాదు ఏకంగా పదేళ్లు. ఆ కరెన్సీ ఏంటో తెలుసా... క్రిప్టో కరెన్సీ. ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న బిట్ కాయిన్ లాంటిదే క్రిప్టో కరెన్సీ. ఇలాంటి ఎన్నో రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. ఇలాంటి వాటిని కలిగి ఉన్నా.. విక్రయించినా లేదా వాటితో లావాదేవీలు జరిపినా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నిషేదిత క్రిప్టో కరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ 2019 బిల్లు ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చారు. క్రిప్టో కరెన్సీల మైనింగ్ చేసినా, జనరేట్ చేసిన, కలిగి ఉన్నా, విక్రయించినా, బదిలీ చేసినా, ఇష్యూ లేదా డీల్ చేసిన పదేళ్ల జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ కరెన్సీలు పూర్తిగా చట్ట విరుద్దమైనవని, వీటిని కలిగి ఉంటే నాన్ బెయిలబుల్ నేరమని కూడా అందులో పేర్కొన్నారు.

క్రిప్టో కరెన్సీ అంటే...
క్రిప్టో కరెన్సీ డిజిటల్ లేదా వర్చ్యువల్ రూపంలో ఉండే కరెన్సీ. దీనికి భౌతిక రూపం ఉండదు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ కరెన్సీని అందుబాటులోకి తెచ్చారు. అనేక క్రిప్టో కరెన్సీలు ఉన్నప్పటికీ బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

ఎందుకు నిషేధం?
ఈ కరెన్సీ పై మన దేశంలో ఏ సంస్థకు నియంత్రణ లేదు. వీటితో లావాదేవీలు నిర్వహించవద్దని ఆర్బీఐ, ప్రభుత్వం హెచ్చరించాయి. ఆదాయ పన్ను శాఖ, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ఈ కరెన్సీలను నిషేధించాయి. ఈ కరెన్సీలను మనీ లాండరింగ్ లాంటి చట్ట వ్యతిరేక లావాదేవీలకు వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారత్ సొంత డిజిటల్ కరెన్సీ
డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్న నేపథ్యంలో సొంత డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని భారత్ యోచిస్తోంది. భారత రిజర్వు బ్యాంకు తో సంప్రదించిన తర్వాత ఈ కరెన్సీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

క్రిప్టో కరెన్సీలపై ఆసక్తి
క్రిప్టో కరెన్సీలపై ప్రజల్లో ఆసక్తి బాగా పెరుగుతోంది. దీనికి కారణం బిట్ కాయిన్. ఆ మధ్య కాలంలో ఈ బిట్ కాయిన్ ధర విపరీతంగా పెరిగి పోయింది. కొంతకాలం తర్వాత దాని ధర కుప్ప కూలి పోయింది. అప్పుడే దీని గురించి పత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చాయి. సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను హాకింగ్ చేసి క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేయడం ఆ ఆమధ్య కాలంలో సంచలనంగా మారింది.
ఎన్ని క్రిప్టో కరెన్సీలున్నాయంటే..
- బిట్ కాయిన్
- లైట్ కాయిన్
-ఎథీరియం
- జడ్ క్యాష్
- రిపిల్
-మోనేరో


Click it and Unblock the Notifications