హైదరాబాద్: TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ దిశగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. సుప్రీం కోర్టు సూచనల మేరకు 48 గంటల ముందు సమాచారం ఇచ్చాకే అరెస్ట్ చేయనున్నారని సమాచారం. అదే సమయంలో దర్యాఫ్తును ప్రభావితం చేసే అవకాశముందనే అంశంతో పోలీసులు న్యాయ సలహా తీసుకొని అరెస్టు అంశంపై ముందుకెళ్లనున్నారని తెలుస్తోంది.
TV9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో మేజర్ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా.. రవిప్రకాశ్ పైన ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సీసీఎస్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిదే. తొలుత ఇచ్చిన నోటీసులపై రవిప్రకాశ్ స్పందించలేదు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లినా చుక్కెదురు కావడంతో మూడు రోజులుగా విచారణకు హాజరవుతున్నారు. గురువారం మూడో రోజు కూడా విచారణకు హాజరయ్యాడు.

అలా అరెస్ట్ చేసే ఛాన్స్
పోలీసుల విచారణలో రవిప్రకాశ్ సమాధానాలు దాటవేత, తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఆయన విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. దీంతోనే ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విచారణకు సహకరించడం లేదని చెప్పి అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. గురువారం ఆయనను విచారిస్తున్న సమయంలో బంజారాహిల్స్ పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు. TV9 లోగోను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలతో రవిప్రకాశ్ పైన కేసు నమోదయింది. ఈ కేసులో శుక్రవారం బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.

మూడో రోజు వ్యూహం మార్చిన సీసీఎస్ పోలీసులు
పోలీసుల విచారణలో రవిప్రకాశ్ పొంతనలేని సమాధానాలు చెప్పాడట. ఆయన తీరుతో సీసీఎస్ పోలీసులు అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది.
ఆధారాలు చూపి ప్రశ్నలు వేస్తున్నా దాటవేత ధోరణి అవలంభించాడట. గురువారం రవిప్రకాశ్‌ను ఉదయం పదిన్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు అంటే 11 గంటల పాటు విచారించారు. బుధవారం పది గంటలకు పైగా విచారించిన పోలీసులు ఆయన నుంచి కావాల్సిన సమాధానాలు రాబట్టలేదట. దీంతో గురువారం వ్యూహం మార్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందట.

వాటి ఆధారంగా ప్రశ్నించిన పోలీసులు
ఫోర్జరీ, పాత తేదీలతో డాక్యుమెంట్ల సృష్టిపై లభించిన ఆధారాలు, రవిప్రకాశ్‌కు ఇతరులకు జరిగిన ఈ-మెయిల్ సంభాషణలు, గతంలో ఇదే కేసులో విచారణకు హాజరైన టీవీ9 మాజీ ఉద్యోగి మూర్తి చెప్పిన సమాచారం, టీవీ9 కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్స్, రవిప్రకాశ్, మూర్తి, శివాజీ ఇళ్లలో సోదాల్లో లభించిన ఆదారాలతో ప్రశ్నించారని తెలుస్తోంది. ఆయనను విచారించిన సమయంలో ఓ ప్రశ్న వేస్తే సరైన సమాధానం రాకపోవడంతో ఆధారాలు చూపి మరింత లోతుగా ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే రవిప్రకాశ్ దర్యాఫ్తును మళ్లించే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

శివాజీ కోసం గాలింపు
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షేర్ల కొనుగోలుకు సంబంధించి పాత తేదీలతో నకిలీ పత్రాలు సృష్టించి కొత్త యాజమాన్యాన్ని అడ్డుకున్నారన్న కేసులో ఈయన ఏ2గా ఉన్నాడు. విచారణలో భాగంగా శివాజీ గురించి రవిప్రకాశ్ వద్ద ఆరా తీసే ప్రయత్నాలు చేశారు పోలీసులు. అయితే శివాజీ ఎక్కడున్నాడో తనకు తెలియదని చెప్పాడని తెలుస్తోంది. తనకు వడదెబ్బ తగిలిందని, చికిత్స అనంతరం విచారణకు వస్తానని శివాజీ కొద్ది రోజుల క్రితం వీడియో సందేశం పంపించాడు.

రవిప్రకాశ్ ఏమన్నారంటే?
TV9 లోగో సృష్టికర్తను తానేనని పోలీసుల విచారణలో రవిప్రకాశ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడని సమాచారం. మూడో రోజు విచారణలో ఆయనను కాసేపు పోలీసులు ఖాళీగా కూర్చోబెట్టారని తెలుస్తోంది. విడతలవారీగా ప్రశ్నించేందుకు అలా చేశారు.


Click it and Unblock the Notifications