10 గం.ల పాటు రవిప్రకాశ్ విచారణ, పొంతనలేని జవాబులు: మోజో టీవీ చేజారిందా?
హైదరాబాద్: డేటా చౌర్యం, ఫోర్జరీ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు రెండో రోజైన బుధవారం పది గంటలకు పైగా విచారించారు. బుధవారం ఉదయం గం.11.30కు ఆయన సీసీఎస్ కార్యాలయానికి వచ్చాడు. అప్పటి నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు విచారించారు. అంటే పది గంటలకు పైగా విచారించారు. ఆయన పొంతనలేని సమాధానాలు ఇచ్చాడని తెలుస్తోంది. విచారణకు సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసులపై ప్రశ్నించారు. TV9 పాత యాజమాన్యం నుంచి అళందా మీడియాకు యాజమాన్య బదలీలు జరగకుండా ఉండేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టి, సంతకం ఫోర్జరీ, దానిని మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అపైర్స్ వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయడంపై నమోదైన ఈ రెండు కేసులపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది.

రవిప్రకాశ్‌పై ప్రశ్నల వర్షం
రవిప్రకాశ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు ముందే క్వశ్చనీర్‌ను సిద్ధం చేసుకున్నారు. కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకంను ఎవరు ఫోర్జరీ చేశారు, ఎందుకు చేశారు. తాజాగా కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలతో ఎన్‌సీఎల్టీకి పాత తేదీలతో శివాజీతో ఎందుకు ఫిర్యాదు చేయించారు, నలభై వేల షేర్లను శివాజీకి ఎందుకు విక్రయించారు, TV9 యాజమాన్య మార్పిడిలో ఇబ్బందులు ఏమిటి, ఏ తప్పు చేయకుంటే ఇన్నిరోజులు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు... తదితర అంశాలపై ప్రశ్నలు కురిపించారని తెలుస్తోంది. మరోవైపు, TV9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్ మార్కును 2018 మే నెలలో మోజో టీవీకి విక్రయించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ నోటీసుపై రవిప్రకాశ్ స్పందించలేదు. దీంతో రెండోసారి నోటీసులు జారీ చేయనున్నారు. హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటారు.

పొంతన లేని రవిప్రకాశ్ సమాధానాలు
పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. పొంతన లేని సమాధానాలతో పోలీసులను గందరగోళపరిచే ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. పలు ప్రశ్నలకు దాటవేసే ధోరణిని అవలంబించారని తెలుస్తోంది. పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తూ పోలీసులకు అసహనం తెప్పించాడని తెలుస్తోంది.
రవిప్రకాశ్ విచారణకు సహకరించలేదని పోలీసులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. దర్యాఫ్తుకు సహకరించడం లేదన్నారు. కాగా, మరోసారి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశాలపై పోలీసులు తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.
మొదటిరోజైన మంగళవారం కొద్ది గంటలే ప్రశ్నించిన పోలీసులు, రెండో రోజైన బుధవారం మాత్రం సుదీర్ఘంగా పది గంటలకు పైగా ప్రశ్నించారు.

మోజీ టీవీని
విచారణకు హాజరు కావడానికి ముందు రవిప్రకాశ్ మీడియాతో మాట్లాడాడు. మీడియాకు, మాఫియాకు మధ్య తెలుగు నేలలో యుద్ధం జరుగుతోందని, ప్రజలు మీడియా వైపు ఉండాలని, తెలంగాణలో మీడియా కబ్జా కాండ కొనసాగుతోందని, ఇందుకు మోజో టీవీయే ఉదాహరణ అన్నాడు. తన మిత్రులు పెట్టుకున్న ఆ ఛానెల్‌ను ఒక్క రూపాయి ఇవ్వకుండా కబ్జా చేస్తున్నారని, కొందరు పోలీసుల సహకారంతో హైదరాబాద్ అమ్రిష్‌పురి ఈ ప్రయత్నంలో ఉన్నారని, మోజో టీవీ నిర్వాహకుల పాస్‌పోర్టులు లాగేసుకొని, కేసులు పెట్టి సత్యాన్ని వధించాలని చూస్తున్నారన్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు మోజో టీవీని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారన్నాడు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే మోజో టీవీ రవిప్రకాశ్ నుంచి చేజారినట్లుగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications