6 నెలల్లో మొదటిసారి భారీ పతనం ! బ్యాంక్ స్టాక్స్‌ను బాదిపడేశారు
ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన వెంటనే మార్కెట్లు కుప్పకూలాయి. గత కొద్ది రోజుల నుంచి ఆర్బీఐ సమీక్షను ఎంతో ఆసక్తిగా గమనించిన మార్కెట్లు ఈ రోజు ఆ ప్రకటన రాగానే నేలచూపులు చూశాయి. 2019లో ఎప్పుడూ లేని విధంగా నిఫ్టీ భారీపతనాన్ని చవిచూసింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రాడేలో అత్యధిక నష్టాలను మూటగట్టుకుంది. స్టాక్ మార్కెట్ వర్గాలు పావు శాతం వడ్డీ రేట్ల కోతను ముందే ఊహించాయి.
అందుకు తగ్గట్టుగా మార్కెట్లు ఈ పాటికే బాగా పెరిగాయి. ముఖ్యంగా నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ప్రైవేట్ స్టాక్స్, అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ స్టాక్స్ కొండెక్కి కూర్చున్నాయి. ఈ రోజు అవన్నీ కుప్పకూలడంలో మార్కెట్లు వణికాయి. సెన్సెక్స్ 40 వేల దిగువన, నిఫ్టీ 12 వేల దిగువన, బ్యాంక్ నిఫ్టీ 31 వేల పాయింట్ల దిగువన ముగియడం ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. చివరకు సెన్సెక్స్ 553 పాయింట్లు కోల్పోయి 39,530 దగ్గర, నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11844 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 732 పాయింట్లు నష్టపోయి 30857 దగ్గర ముగిశాయి.
కోల్ ఇండియా, టైటన్, హీరోమోటోకార్ప్, పవర్ గ్రిడ్, హిందుస్తాన్ యునిలివర్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. గెయిల్, ఇండియాబుల్స్ హోసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి. టాప్ లూజర్స్‌లో గెయిల్ మినహా అన్నీ బ్యాంకింగ్ సంబంధ స్టాక్స్ స్టాక్స్ ఉండడం గమనించాల్సిన అంశం.

బ్యాంకింగ్ స్టాక్స్‌లో భయం
బ్యాంకింగ్, బ్యాంకింగేతర స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిన ఇండియాబుల్స్ హౌసింగ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ వంటి స్టాక్స్‌లో కనీసం ఐదు శాతం పతనం మొదలైంది. అలహాబాద్ బ్యాంక్ 7.5 శాతం, ఓరియంటల్ బ్యాంక్ 7 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7 శాతం, సిండికెట్ బ్యాంక్ 7 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతం పతనమయ్యాయి.
ఎన్.బి.ఎఫ్.సి స్పేస్‌లో ఎడిల్వైజ్ ఫైనాన్స్ 9 శాతం, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, రిలయన్స్ క్యాపిటల్ 7 శాతం కోల్పోయాయి.

దివాన్ హౌసింగ్ స్ట్రోక్
రూ.1000 కోట్ల వడ్డీ బకాయిల చెల్లింపు ఆలస్యం నేపధ్యంలో దివాన్ హౌసింగ్ స్టాక్ భారీగా పతనమైంది. వాటాల అమ్మకంతో పాటు అతి త్వరలోనే బకాయిలు తీర్చేస్తున్నామంటూ సంస్థ ప్రకటన చేసినప్పటికీ స్టాక్ మాత్రం కుప్పకూలింది. ఇంట్రాడేలో రూ.92 కనిష్టానికి పడిన స్టాక్ కాస్త కోలుకున్నప్పటికీ నిలబడలేదు. చివరకు 16 శాతం నష్టంతో రూ.94 దగ్గర స్టాక్ క్లోజైంది.

సిమెంట్ స్టాక్స్ మంటలు
మోడీ సర్కార్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారీగాపెరిగిన సిమెంట్ స్టాక్స్‌లో అనూహ్యమైన లాభాల స్వీకరణ వస్తోంది. దక్షిణాదిలో సిమెంట్ రేట్లు తగ్గడం, ఆఫ్ సీజన్ కూడా మరో కారణమైంది. దీంతో ఇండియా సిమెంట్స్ 5 శాతం, సాగర్ సిమెంట్స్ 5 శాతం, ప్రిజం సిమెంట్స్, కేశోరాం, జెకె లక్ష్మి 6 శాతం కోల్పోయాయి.


Click it and Unblock the Notifications