ఈ ధర మేం భరించలేం: అమెరికా కంటే.. భారత్ 5G స్పెక్ట్రం అతిఖరీదు!
న్యూఢిల్లీ: 5G స్పెక్ట్రం ధరపై టెలికం కంపెనీలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ స్పెక్ట్రం వేలం త్వరలో ఉంటుందని, 100 రోజుల గడువులో ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ధరలు చాలా అధికమని టెలికం పరిశ్రమ భావిస్తోంది. సౌత్ కొరియా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే భారత్ 5G స్పెక్ట్రం ధర 30 శాతం నుంచి 40 శాతం అధికమని భావిస్తున్నారు.
5G స్పెక్ట్రం ధరలు భారీగా ఉన్నాయని, దీంతో తమ ఆర్థిక పరిస్థితి మరింత ఇబ్బందికరమవుతుందని టెలికం రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 5G సేవలు దేశంలో సామాజిక లక్ష్యాలను నెరవేర్చేలా ఉండే విధంగా స్పెక్ట్రంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలని సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. స్పెక్ట్రం కనీస సిఫార్సు ధర చాలా ఎక్కువగా ఉందని, దీన్ని తాము భరించలేమన్నారు. దక్షిణ కొరియా, అమెరికా వంటి మార్కెట్లతో పోల్చితే దాదాపు 30-40 శాతం అధికంగా ఉందన్నారు.

5G స్పెక్ట్రం హేతుబద్దమైన ధరలకు అందుబాటులో ఉండాలని, ట్యాక్స్ వంటివి కూడా తక్కువగా ఉండాలని వొడాఫోన్ ఐడియా సీఈవో, సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం నూతన అధ్యక్షుడు బాలేశ్ శర్మ అన్నారు. 5G సేవలకు ధీటుగా నెట్ వర్క్ సామర్థ్యాలు విస్తరించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. గత వారం భారతీ ఎయిర్‌టెల్ కూడా ట్రాయ్ సిఫార్సు చేసిన ధరలు అన్యాయమని, చాలా ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని విజ్ఞప్తి చేసింది.
కాగా, 5G సహా దేశంలో 8644 మెగా హెడ్జ్ స్పెక్ట్రం ధరను రూ.4.9 లక్షల కోట్లుగా ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ ధర అధికంగా ఉందని టెలికం పరిశ్రమ ఆందోళన చెందుతోంది. 5G ద్వారా టెక్నాలజీ గ్రామీణ ప్రజల ముంగిటకు వెళ్తుందని రవిశంకర ప్రసాద్ అన్నారు. రానున్న ఆరు నెలల్లో 5G స్పెక్ట్రం వేలం వేస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ధర అధికంగా ఉందని చెబుతుండటంతో ఇప్పటికే తీవ్ర ఆర్థికపరంగా ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం ఈ స్పెక్ట్రంపై ఆసక్తి చూపుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఒత్తిడిలో ఉన్న దేశీయ టెలికం రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై దృష్టి సారిస్తానని, సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని కేంద్రమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేయాలని పరిశ్రమ కోరుతోంది. జియో రాకతో చోటుచేసుకున్న చార్జీల యుద్ధం వల్ల చాలా టెలికం సంస్థలు ఇప్పుడు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications