రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్ట్ తరహాలో మారుస్తామని, భద్రత కూడా పెంచుతామని దశాబ్దాల నుంచి మనం వింటూనే ఉన్నాం. బడ్జెట్లు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ రైళ్లు, స్టేషన్లు మాత్రం అలానే ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో స్వల్ప మార్పులు మినహా పెద్దగా ఒరిగేందేమీ లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం రైల్వేలకు నిజంగానే మంచి రోజులు రాబోతున్నట్టు కనిపిస్తోంది. విమానాశ్రయాల రేంజ్‌లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు ఆర్పీఎఫ్‌కు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతోంది.

ఇకపై ఒకే ఎంట్రన్స్
సాధారణంగా రైల్వేస్టేషన్లలో మూడు నాలుగు ద్వారాలు ఉంటాయి. ఎవరి ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాని స్థితి. దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లన్నింటిలోనూ ఇదే స్థితి ఉంది. కానీ ఇకపై ప్రధాన స్టేషన్లలో మొదటగా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు. స్కానింగ్ గాడ్జెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు సుశిక్షితులైన ఆర్పీఎఫ్ కమాండోస్‌ను నియమించబోతున్నట్టు ఆర్బీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ వెల్లడించారు. మొదటగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ను నియంత్రణలోకి తెచ్చుకుంటామని డీజీ చెబ్తున్నారు. వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లు అందరికీ ఒకే ప్రాంతంలో ఎంట్రీ పాయింట్ ఉండాలని చూస్తున్నారు.

మరి నిధులు?
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పెద్ద రైల్వే స్టేషన్లకు భద్రత పెంచాలంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అయితే మొదటగా రూ.115 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లకు ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టబోతున్నారు. వాటికి సెక్యూరిటీ యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు అనుసంధానం చేయబోతున్నారు. సుమారు 3000 కిమీల మేర ప్రధాన స్టేషన్లలో గోడలను నిర్మించబోతోంది ఆర్పీఎఫ్.
ఇప్పటికే గుజరాత్‌లోని గాంధీ నగర్, హబీబ్ గంజ్ స్టేషన్లను పూర్తి ఆధునిక శైలిలో పటిష్ట భద్రతతో నిర్మించారు. త్వరలో ఢిల్లీ, ముంబైలో కూడా ఈ తరహా సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది రైల్వే పోలీస్.

చోరీలూ విపరీతమే
రైల్వే ప్రయాణీకుల భద్రతతో పాటు ఆస్తుల రక్షణ కూడా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థలాల్లో నిల్వ ఉంచిన వివిధ వస్తువులు, సరుకులు చోరీకి గురవుతున్నాయి. దీని వల్ల రైల్వే శాఖకు భారీగా నష్టం వస్తోంది. ఈ దృష్ట్యా భారీ ప్రహరీ గోడల నిర్మాణంతో చర్యలు మొదలుపెట్టబోతున్నారు.

ఆర్బీఎఫ్‌కు ఫుల్ పవర్స్
పేరుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నా.. వాళ్లకు ఉన్న అధికారాలు పరిమితమే. ఐపీఎఫ్‌లో కొన్ని సెక్షన్ల మార్పుతో వీళ్లకు బలాన్ని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు అనేక మంది ఆర్పీఎఫ్ కమాండోలు మావోయిస్ట్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాళ్లందరినీ వెనక్కి రప్పించి స్టేషన్ల భద్రతకు వినియోగించాలని చూస్తున్నారు.
అంతేకాదు ఇకపై రైళ్లలో లైంగిక వేధింపులు, చోరీలు, అత్యాచారాలు వంటి వాటికి ఆర్పీఎఫ్ పోలీసులే దర్యాప్తు చేసి కఠిన శిక్షలు విధించబోతున్నారు.
అయితే లక్ష్యాలు భారీగా ఉన్నప్పటికీ వాళ్ల దగ్గరున్న రూ.115 కోట్ల బడ్జెట్ ఏ మూలకు సరిపోతుంది అనేదే ప్రస్తావించాల్సిన అంశం.


Click it and Unblock the Notifications