హైదరాబాద్: TV9 మాజీ సీఈవో రవిప్రకాశ్ మంగళవారం నాడు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయన ఈ రోజు (4 జూన్) సీసీఎస్ ఎదుట హాజరయ్యాడు.
నటుడు శివాజీతో పాటు నకిలీ పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్‌ను మరో కంపెనీకి బదలాయించారనే అరోపణలతోను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
ఈ నేపథ్యంలో తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. 41 ఏ నోటీసు కింద కూడా నోటీసులు ఇచ్చారు. మరోవైపు, ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లారు. రెండు కోర్టుల్లోను ఆయనకు చుక్కెదురైంది.

ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించలేదు. విచారణాధికారుల ముందు హాజరు కావాలని సూచించింది. రవిప్రకాశ్ పిటిషన్‌ను జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షా... వెకేషన్ ధర్మాసనం విచారించింది. ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
అదే సమయంలో పిటిషనర్ కొత్తగా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆయన హైకోర్టులో మూడు దఫాలుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. పోలీసుల విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో మంగళవారం హాజరయ్యారు.


Click it and Unblock the Notifications