ఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ సంస్థలోని దాదాపు 2వేల మంది సిబ్బందికి స్పైస్ జెట్‌లో అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో పైలట్లు, కేబిన్ క్రూ తదితరులను తీసుకోనున్నారు. జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే తాత్కాలికంగా తన సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన పలు విమానాలను తీసుకుంది. ఇప్పుడు ఉద్యోగుల్ని తీసుకోనున్నారు.
తాము తగినంత మంది జెట్ ఎయిర్వేస్ సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నామని, వారు అనుభం, అర్హత కలిగినవారని, ఇకముందు కూడా మరింత మందిని తీసుకుంటామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ అన్నారు. జెట్ ఉద్యోగులకు తాము ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే 1,100 మందిని తీసుకున్నామని, ఇది రెండువేలకు చేరవచ్చునని చెప్పారు. భారత వైమానిక రంగం ఎదుగుతోందన్నారు. విమానాలు, సర్వీసుల విస్తరణకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు చేపడుతున్నామన్నారు.
ప్రస్తుతానికి నారో బాడీ విమానాలపైనే దృష్టి సారించామని, అంతర్జాతీయ విమాన కేంద్రంగా భారత్ మారినప్పుడు దీర్ఘకాలం ప్రయాణించే విమానాలు నిర్వహిస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ సీట్ల సామర్థ్యాన్ని 80 శాతం మేర విస్తరిస్తున్నామన్నారు. ఇందులో ఎక్కువగా లీజ్ ద్వారా ఉంటుందని, అందువల్ల నిధుల అవసరం ఎక్కువగా ఉండదని, విమానాల లీజ్ బ్యాక్‌తో పాటు ఆఫర్ సేల్ వల్ల సీట్లు ఎక్కువగా ముందుగానే విక్రయించడంతో నగదు లభ్యత బాగుందన్నారు. కాబట్టి నిధుల సమీకరణ యోచన లేదన్నారు.

ప్రస్తుతం స్పైస్ జెట్ వద్ద 14వేల మంది సిబ్బంది, 100 విమానాలున్నాయి.
కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏప్రిల్ 17న జెట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, జెట్ సంక్షోభంతో భారతీయ విమానయాన మార్కెట్లో అవకాశాలు సన్నగిల్లాయని స్టార్ అలయెన్స్ సీఈవో జెఫ్రీ గో ఆందోళన వ్యక్తం చేశారు. అలయెన్స్‌లోని ఎయిరిండియా ప్రభావశీలంగా పని చేస్తున్నప్పటికీ జెట్ తాత్కాలికంగానైనా తన సేవలు నిలిపి వేయడం అతిపెద్ద ఏవియేషన్ మార్కెటైన భారత్‌లో అవకాశాలను మృగ్యం చేసిందన్నారు.
స్టార్ అలయెన్స్‌లో ఎయిరిండియా సహా మొత్తం ఇరవై ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. 2014 జూలైలో ఎయిరిండియా చేరింది. భారత ఉప ఖండంలో అలయెన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిరిండియా కీలక భూమిక పోషిస్తోందన్నారు. సహచర సంస్థల కనెక్టింగ్‌కు ఎంతో దోహదం చేస్తోందన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను అధికంగా నడిపే జెట్ ఎయిర్వేస్ సేవలు నిలిచిపోవడం ఇక్కడి మార్కెట్‌పై ప్రభావం చూపుతోందన్నారు. ఎయిరిండియా సేవలు బలంగానే ఉన్నా ఆ ప్రభావం కనెక్టింగ్ ఎయిర్‌లైన్స్‌పై కనిపిస్తోందన్నారు.


Click it and Unblock the Notifications