ఏపీ గట్టెక్కాలంటే రూ.40 వేల కోట్లు అవసరం, ప్రజలపై భారం వద్దన్న జగన్
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం గట్టెక్కాలంటే రూ.40వేల కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ లెక్కలు తేల్చి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారులు నివేదించారు. ఇప్పటికే నాలుగు నెలల కాలానికి రూ.2,26,178 కోట్ల అంచనాతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించారు. ఖర్చులు, ఆదాయం లెక్కలతో రూ.39,815 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉందని తేల్చారు.

జగన్ ప్రకటించిన పథకాలకు ఎంత అవసరమంటే?
రావాల్సిన మొత్తం లేదా ఆదాయంలో రూ.26వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గనుందని తేల్చాలని తెలుస్తోంది. జగన్ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. వాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లకు పైగా అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పింఛన్లకు రూ.2,500 కోట్లకు పైగా, గ్రామ వాలంటీర్లకు రూ.1,500 కోట్లు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలకు రూ.2,200 కోట్లు.. ఇలా మొత్తం రూ.12 వేల కోట్లకు పైగా అవసరమని తేల్చారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి గ్రాంట్, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంది.

ఏపీ ఆర్థిక వ్యవస్థపై నివేదించాలని జగన్
ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని సీఎం జగన్ ఇప్పటికే అధికారులకు సూచించారు. అస్తవ్యస్థమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలన్నారు. 15వ ఆర్థిక సంఘం ముందు ఏపీ తన వాదనను సరిగ్గా వినిపించాలని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని అధికారులకు సూచించారు.

ప్రజలపై భారం వద్దు
ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు. సామాన్యులపై భారం వేయకుండా ఆదాయ వనరుల పెంపుకు ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. గ్రీన్ ట్యాక్స్, వ్యర్థపదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు, ఇసుక విధానం వంటి చర్యలతో ఆదాయం పెంపు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.


Click it and Unblock the Notifications