హైదరాబాద్ : ఐటీ హబ్ హైదరాబాద్ లో మరో సేవలు రాబోతున్నాయి. కాలుష్య కాసారాన్ని కాస్తైనా తగ్గించేందుకు రూట్ మ్యాటిక్ కంపెనీ అడుగిడబోతోంది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఐటీ కంపెనీ ఉద్యోగులను పికప్, డ్రాప్ చేస్తుంటుంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో తమ సేవలను విస్తరించగా .. తాజాగా హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. తొలుత 10 వాహనాలతో సేవలు ప్రారంభిస్తామని .. తర్వాత 600 వాహనాలకు విస్తరిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్ నిపుణులను నియమించామని పేర్కొంది. మైండ్ ట్రీ సహా మరొ నాలుగైదు కంపెనీలతో చర్చలు కొలిక్కివచ్చినట్టేనని స్పష్టంచేసింది. సెప్టెంబర్ వరకు 600 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ కో-ఫౌండర్, సీఈఓ సురాజిత్ దాస్ తెలిపారు.
ఇంతింతై ..
ఐఎస్‌బీ పూర్వ విద్యార్థి సురాజిత్ దాస్, తన స్నేహితుడు శ్రీరామ్ కన్నన్‌తో కలిసి రూట్ మ్యాటిక్ కంపెనీ నెలకొల్పాడు. 2013లో బెంగళూరులో కంపెనీని ప్రారంభించారు. రూట్‌మ్యాటిక్ ఉద్యోగుల రవాణా కోసం వాహన సర్వీసులు, ట్రాన్స్‌పోర్ట్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ సర్వీసులు అనే రెండు సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, మధురై వంటి 12 నగరాల్లో సేవలందిస్తుంది. సిస్కో, బార్క్‌లెస్, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి 60కి పైగా కార్పొరేట్ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి.

700 వాహనాలు .. 1.50 లక్షల కస్టమర్లు
రూట్ మ్యాప్ కంపెనీకి 700కు పైగా వాహనాలు, 1.50 లక్షల మంది కస్టమర్లున్నారు. నెలకు 10 లక్షల కి.మీ. ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 4 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థలో 200 మంది ఉద్యోగులున్నారని .. మరొ 100 మందిని నియమించుకుంటామని సురాజిత్ తెలిపారు. ఇప్పటివరకు 31 కోట్ల నిధులను సమీకరించామని .. సంస్థలో బ్లూమ్ వెంచర్స్, దుబాయ్‌కు చెందిన వ్యామ్ క్యాపిటల్, కెఫే కాఫీ డే మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నరేష్ మల్హోత్ర పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఈ ఏడాది మరో రూ.175 కోట్లు నిధులను సమీకరిస్తామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications