GST కింద అరెస్ట్ అధికారాలు పరిశీలిస్తాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద అరెస్టు అధికారాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. దీనిపై బుధవారం భారత అత్యున్నత న్యాయస్థానం సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఏర్పాటైన ధర్మాసనం విచారణ చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల మీద వివరణ ఇవ్వాలని కేంద్రానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ ఎగవేత నేపథ్యంలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని పలు హైకోర్టులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. కాబట్టి ఈ అరెస్టులపై చట్టంలోని నిబంధలను సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.
అరెస్ట్ అదికారంపై చట్టం ఏమంటుందో చూడాలని పేర్కొంది. అలాగే, జీఎస్టీ చట్టం కింద అరెస్టైన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే ముందు ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును తాము సమర్థించిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. జీఎస్టీ ఎగవేత కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరులో అన్ని రాష్ట్రాల హైకోర్టుల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం ప్రకటిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడం గమనార్హం. ఇలాంటి కేసుల్లో అరెస్టుల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరని తెలంగాణ హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను ఈ నెల 27న సుప్రీం కొట్టి వేసింది.
జీఎస్టీ ఎగవేత కేసుల్లో అరెస్ట్‌లు ఆందోళనకరమని ఆ పిటీషన్లో పేర్కొన్నారు. సీజీఎస్టీ చట్టం కింద హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ తమ వద్దకు వచ్చిన పిటిషనర్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 18న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది కూడా.


Click it and Unblock the Notifications