ఖజానాVsఖర్చులు: జగన్‌కు సవాలే, ఖజానాలో రూ.100 కోట్లు, కావాల్సింది రూ.5వేల కోట్లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు (మే 30) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లు గెలిచింది. ఏడింట ఆరు వంతులకు పైగా మెజార్టీ సాధించింది. ముఖ్యమంత్రిగా జగన్ ముందు ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, పారిశ్రామిక రంగాన్ని, సేవా రంగాన్ని ఏపీకి తీసుకు రావడం, అభివృద్ధి వికేంద్రీకరణ.. ఇలా ఎన్నో అంశాలు ఆయన ముందు ఉన్నాయి.

ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి
జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి (మే 30వ తేదీ) రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీగా ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఇరవైసార్లు ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లింది. ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం కూడా కొత్త ప్రభుత్వం అదే దారిన వెళ్లాల్సిన పరిస్థితి. ఖజానాలో ఇప్పుడు కేవలం వంద కోట్లు రూపాయలు మాత్రమే ఉన్నాయట. కానీ జీతాలు, పింఛన్లు వంటి ఎన్నో అవసరాలకు రూ.5,000 కోట్లు అవసరమట.

బహిరంగ మార్కెట్ రుణాలకు నో ఛాన్స్
రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి క్వార్టర్‌లో రూ.8,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలకు అనుమతివ్వగా, ఇప్పటి వరకు ఏడువేల కోట్ల రూపాయలు తీసుకున్నారట. అంటే బహిరంగ రుణాలకు కూడా అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. రాష్ట్ర పరిస్థితిని బట్టి, ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీలను తనఖా పెట్టి ఆర్బీఐ నుంచి బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకుంటారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే మోడీకి చెప్పిన జగన్
ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరారు. అయితే ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో దానిపై ఒత్తిడి చేసే పరిస్థితి లేదని జగన్ మీడియా సమావేశంలోనే చెప్పారు. కానీ హోదా గురించి పదేపదే అడుగుతామని చెప్పారు. ప్రధానితో జరిగిన భేటీలో ప్రత్యేక హోదా అవశ్యకత గురించి, ఏపీ ఓవర్ డ్రాఫ్టుపై బతకాల్సిన పరిస్థితుల గురించి చెప్పానని జగన్ తెలిపారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగానే ఉన్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications