అమెరికా ఆంక్షలు పక్కన పెట్టి.. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు, కానీ
అమెరికా ఆంక్షల నేపథ్యంలో మే 2వ తేదీ నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులను నిలిపివేసింది భారత్. వీటిని నిలిపివేసిన కొద్ది వారాలకే తిరిగి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు పునఃప్రారంభించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి ఆయిల్ దిగుమతులు చేసుకొని ఇరాన్‌కు ఇండియన్ రూపాయిలోనే చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.

ఇరాన్‌తో ఆయిల్‌పై చర్చలు
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని, లోకసభ ఎన్నికల్లో రికార్డు సృష్టించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆయిల్ దిగుమతులపై ఇరాన్‌తో చర్చలు ప్రారంభించిందని చెబుతున్నారు. అయితే, గతంలో దిగుమతు చేసుకున్నట్లుగా భారీగా ఉండవని, ఆయిల్ దిగుమతులు తగ్గనున్నాయని అంటున్నారు.

అమెరికా నిషేధం ఉన్నప్పటికీ...
అమెరికా విధించిన నిషేధాన్ని భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాబట్టి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతుల పట్ల ఆసక్తిగా ఉందని, అయితే దిగుమతులు మాత్రం తగ్గవచ్చునని ప్రభుత్వ అధికారి వెల్లడించినట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన పసర్‌గఢ్ బ్యాంక్ బ్రాంచి ముంబైలో ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. దీనిని ఆయిల్ సరఫరా పేమెంట్స్ కోసం ఉపయోగించనున్నారు. పేమెంట్స్‌ను సదరు ఇరానియన్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే, ఇరానియన్ అధికారులు వారికి ఇష్టమైన తీరులో ఉపయోగించుకోవచ్చునని చెబుతున్నారు.

ఇండియన్ రూపాయిలో చెల్లింపులు
ఇండియన్ రూపాయిలో ఇరాన్‌కు భారత్ చెల్లింపులు చేయనుందని అధికారులు చెప్పారు. ఇరాన్ - భారత్ మధ్య ఆయిల్ దిగుమతులపై చర్చలు ఎప్పుడో ప్రారంభమయ్యాయని, కానీ సార్వత్రిక ఎన్నికల కారణంగా అప్పుడు నిలిచిపోయాయని, ఇప్పుడు తిరిగి చర్చలు జరుగుతాయని, ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్న వాటిల్లో ఇది ఒకటి అని అధికారులు చెబుతున్నారు. ఇదివరకు, క్రూడాయిల్‌కు బదులుగా భారత్ పలు ఉత్పత్తులను ఇరాన్‌కు విక్రయించింది.

ఇరాన్ అధ్యక్షుడికి మోడీ థ్యాంక్స్
ఇదిలా ఉండగా, భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ హుస్సేన్ రౌహానీ విషెస్ తెలిపారు. ఆయనతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్ అధ్యక్షుడికి కూడా థ్యాంక్స్ చెప్పారు. 'ఇరాన్ అధ్యక్షుడు రౌహానీకి థ్యాంక్స్. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడేందుకు కలిసి పని చేద్దాం' అని మోడీ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications