ఆరంభంలో రికార్డులు... ఆఖర్లో భారీ నష్టాలు !
ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే ఎగ్జాక్ట్ పోల్స్‌లో ఎన్డీఏ, బిజెపి మరింత స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోవడం స్టాక్ మార్కెట్లను ఎగిరి గంతేసేలా చేసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డులను నమోదు చేసి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్ ఏకంగా 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్ల మార్కును క్రాస్ చేసి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. అయితే మధ్యాహ్నం సమయానికి స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకోవడం ఆశ్యర్యపోయేలా చేసింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ ఏకంగా 430 పాయింట్లు, సెన్సెక్స్ 1300 పాయింట్లు కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. చివరకు సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి 38,812 దగ్గర ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 11657 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 118 పాయింట్ల నష్టంతో 30409 దగ్గర స్థిరపడింది.
అదానీ పోర్ట్స్, జీ ఎంటర్‌టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గ్రాసిం, సిప్లా స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక వేదంతా, ఐషర్ మోటార్స్, ఐటిసి, హిందాల్కో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్టాక్స్ నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రెండు ఇండెక్సులూ పావు శాతం వరకూ నష్టపోయాయి. ఇక మిగిలిన సెక్టోరల్ సూచీల వారీగా చూస్తే మీడియా, రియాల్టీ రంగాల్లో స్వల్పంగా కొనుగోళ్లు నమోదయ్యాయి. మెటల్, ఎఫ్ఎంసిజి, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ నష్టపోయాయి.
అనిల్ అంబానీ కంపెనీల్లో ఉత్సాహం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలైనప్పటి నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఈ రోజు కూడా రిలయన్స్ నిప్పాన్ 7 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 3 శాతం లాభపడ్డాయి. అయితే రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్స్ మాత్రం నీరసించాయి. రిలయన్స్ పవర్‌లో మాత్రం స్పష్టమైన లాభాల స్వీకరణ నమోదైంది.
రాంకీ ఇన్ఫ్రాకు జగన్ ఎఫెక్ట్
హైదరాబాద్‌కు చెందిన రాంకీ ఇన్ఫ్రా.. అయోధ్యరామిరెడ్డి సంస్థ. ప్రమోటర్‌కు చెందిన బంధువు వైసీపీ నుంచి పోటీచేశారు. ఇప్పుడు వైసీపీ అఖండ విజయంతో రాంకీ ఇన్ఫ్రా స్టాక్ భారీగా లాభపడింది. ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ పడింది. రూ.125 దగ్గర క్లోజైంది.
మెర్క్‌కు డివిడెండ్ ఎఫెక్ట్
మెర్క్ సంస్థ స్టాక్ ఈ రోజు ఎక్స్ డివిడెండ్ అయింది. దీంతో ఈ స్టాక్ ఏకంగా 10 శాతం కోల్పోయింది. ఇంట్రాడేలో రూ.3930 స్థాయికి పతనమైన స్టాక్ చివరకు రూ.3947 దగ్గర క్లోజైంది.
మిడ్ క్యాప్స్‌లో నష్టాలు
గత కొద్దికాలం నుంచి నీరసంగానే ట్రేడవుతూ భారీ నష్టాలను మూటగట్టుకుంటూ వస్తున్న స్టెరిలైట్ టెక్నాలజీస్ ఈ రోజు ట్రేడ్‌లో కూడా 8 శాతం నష్టంతో రూ.149 దగ్గర క్లోజైంది.
ఇక ఎడిల్వైజ్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ నమోదవుతోంది. ఈ రోజు కూడా మరో 5 శాతాన్ని కోల్పోయింది ఎడిల్వైజ్. చివరకు రూ.173 దగ్గర స్టాక్ క్లోజైంది.
మైక్రోక్యాప్ స్టాక్స్‌లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఏఖంగా 9 శాతం కోల్పోయింది. చివరకు రూ.250 దగ్గర క్లోజైంది. మాంటే కార్లో, అక్షర్ కెమ్, అసాహీ సంగ్వాన్, ముంజాల్ షోవా వంటి స్టాక్స్ 5 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications