బ్యాంకింగ్ రంగంలో మరో అతిపెద్ద విలీనానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను కలిపేయొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను ఆర్బీఐ విలీనం చేసింది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో రెండో రౌండ్‌ను మొదలుపెట్టాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను రెడీ చేసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు రెండు అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్నాయి. మొండి బకాయిల భారం నుంచి బయటపడే స్థితిలో లేక వరుసగా నికర నష్టాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. దీంతో ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు, ఉద్యోగుల భవిష్యత్తును కాపాడి పెద్ద బ్యాంకులుగా మార్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగుతోంది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రా బ్యాంక్ నష్టాల కుప్ప
వాస్తవానికి ఆంధ్రా బ్యాంక్ మూడేళ్ల నుంచి నష్టాలనే ప్రకటిస్తూ వస్తోంది. సెప్టెంబర్ 2017 క్వార్టర్‌లో రూ.385 కోట్ల నష్టాన్ని మొదటగా ప్రకటించిన ఆంధ్రా బ్యాంక్ ఆ తర్వాత దాన్ని నాలుగు రెట్లకు పెంచుకుంది. మార్చి 2019లో బ్యాంక్ నష్టం రూ.1234 కోట్లు. దీనికి తోడు మొండి బకాయి భారం 16.21 శాతం. ఇండస్ట్రీలో ఏ ప్రభుత్వ బ్యాంకుకూ లేనన్ని నిరర్ధక ఆస్తులు ఆంధ్రా బ్యాంక్ సొంతం. దీంతో ఈ బ్యాంక్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
అలహాబాద్ బ్యాంకూ అంతే
ఈ బ్యాంక్ కూడా డిసెంబర్ 2017 నుంచి నష్టాలనే ప్రకటిస్తోంది. మార్చి 2016లో రూ.743 కోట్లుగా ఉన్న బ్యాంక్ నష్టం మొన్న రూ.8834 కోట్లకు పెరిగింది. దీంతో ఇది కూడా అత్యంత బలహీనంగా మారింది.
ఓరియంటల్ బ్యాంక్‌దీ అదే దారి
మార్చి 2017లో రూ. 1094 కోట్ల నికర నష్టాన్ని బ్యాంక్ ప్రకటించింది. మార్చి 2018లో ఇదే బ్యాంక్ రూ.5872 కోట్లు నష్టాన్ని మూటగట్టుకుంది.
ఇలా ఈ మూడు బలహీన బ్యాంకులనూ రెండో అతిపెద్ద బ్యాంకులో విలీనం చేసి ఎంతో కొంత కాపాడాలనేది ఆర్బీఐ యోచన. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నష్టాల్లోనే ఉన్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య, బ్యాంక్ శాఖలు, బిజినెస్ వంటివి పరిశీలిస్తే.. నిలదొక్కుకునేందుకు ఆస్కారం ఎక్కువ.


Click it and Unblock the Notifications