అమెరికా-రష్యా మధ్యలో... పెద్దన్నకు షాకిచ్చిన టర్కీ: అసలేం జరిగింది?
అమెరికా, రష్యా దేశాలతో సంబంధాలను బ్యాలెన్స్ చేసేందుకు టర్కీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, డిఫెన్స్ మిసైల్స్ విషయంలో అమెరికా ఆదేశాలను బేఖాతరు చేస్తోంది. తాజాగా, నాటో దేశమైన టర్కీ పెద్దన్న అమెరికాకు గట్టి షాకిచ్చింది. రష్యా నుంచి ఎస్400 కొనడం ఖాయమైందని, భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి ఎస్500 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉత్పత్తికి కలిసి పని చేస్తామని టర్కీ అధ్యక్షులు తెలిపారు. రష్యా నుంచి ఎస్400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయడంపై అమెరిగా ఆగ్రహంగా ఉంది. ఎస్ 400 కొనుగోలు పూర్తయిందని, ఎస్ 500లో కలిసి పని చేస్తామని ప్రకటించడం గమనార్హం.
అమెరికాతో సహా కలిసి 9 దేశాలు చేపట్టిన ఎఫ్ 35 యుద్ధవిమానాల తయారీలో టర్కీ కూడా ఉంది. దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టులో పని చేస్తోంది. టర్కీ 100 ఎఫ్ 35 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. అమెరికా ఇప్పటి వరకు చేపట్టిన అతి ఖరీదైన ప్రాజెక్టు ఇది. ఈ విమానాలు ఎంతగా అమ్మగలిగితే అంత ప్రాజెక్టు ఖర్చు రానుంది. కానీ ఇప్పుడు టర్కీ.. రష్యాకు చెందిన ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ, ఎఫ్ 35 యుద్ధవిమానాలను టర్కీ ఒకేసారి వినియోగించే పరిస్థితి వచ్చింది.

అయితే, ఎఫ్ 35కు ఉండే అతిస్వల్ప రాడార్ సిగ్నేచర్‌ను రష్యాకు చెందిన ఎస్ 400 రాడార్లు గుర్తిస్తే ప్రమాదమని అమెరికా భావిస్తోంది. ఇది రష్యాకు చేరితే ఎఫ్ 35లను గుర్తించే రాడార్లను అభివృద్ధి చేస్తుందని భావిస్తోంది. అప్పుడు ఈ ప్రాజెక్టుకు ఫలితం ఉండదని అమెరికా ఆందోళన చెందుతోంది. అమెరికాకు చెందిన ఎఫ్ 35 రాడార్ సిగ్నేచర్‌లు ఎస్400కు చేరకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పినా, అమెరికా నో చెబుతోంది. అందుకే ఎఫ్ 25లను సరఫరా చేయలేదు. అయితే ఎఫ్ 35లను తాము దక్కించుకుంటామని టర్కీ చెబుతోంది.
ఎక్కడ చెడింది?
నాటో దేశాల్లో టర్కీ ఒకటి. టర్కీ ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో, దేశంలో జరిగిన తిరుగుబాటు కుట్రలో ఉన్నాడనే ఆరోపణలతో అమెరికా పాస్టర్ ఆండ్రూ బ్రాన్సన్‌ను టర్కీ అరెస్ట్ చేసింది. దీంతో అమెరికా, టర్కీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత టర్కీ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ రెట్టింపు చేసింది. ఇది టర్కీ కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికా చిన్నాభిన్నం చేస్తోందని టర్కీ ఆగ్రహంతో ఉంది. దీంతో ఎస్ 500 రష్యాతో కలిసి ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అవసరమైతే నాటోను వీడుతామని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications