అణ్వాయుధాలు.. ప్రపంచ యుద్ధాలు.. కలిగించే నష్టం కంటే.. ఈ రోజుల్లో వాణిజ్యు యుద్ధాలే ప్రపంచ మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందుకే చైనా - అమెరికా మధ్య తలెత్తిన వివాదాన్ని ప్రపంచమంతా అంత ఆందోళనతో చూస్తోంది. తాజాగా అమెరికా దేశం.. చైనా నుంచి దిగుమతి అయ్యే 200 బిలియన్ డాలర్ల వస్తువులపై పన్ను రేట్లను పెంచింది. దీంతో ప్రతీకార చర్యగా చైనా కూడా 60 బిలియన్ డాలర్ల అమెరికా ఇంపోర్ట్స్‌పై పన్నులు పెంచింది. ఇలా రెండు దేశాలూ.. ఒకదానికి ఒకటి.. పోటాపోటీగా పన్నులు వేసుకుంటున్నాయి. ఇంకో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. రాబోయే రోజుల్లో చైనాపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్. దీంతో చైనా కూడా ఆర్థికంగా ఎదుర్కొనేందుకు, ఎంత దూరమైన వెళ్లడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఏకంగా 255 లక్షల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకుంది.

డబ్బులతో ముంచేయాలి
ఒక వేళ అమెరికా అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే అదే స్థాయిలో ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రభుత్వ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఇందుకోసం అవసరమైతే వడ్డీ రేట్లను తగ్గించడం, పన్నుల్లో కోత విధించడం వంటి అనేక ప్రణాళికలను అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. చైనా కేంద్ర, ప్రాంతీయ అధికారుల దగ్గర ప్రస్తుతం 25.1 ట్రిలియన్ యువాన్స్ రెడీగా ఉన్నాయి. అంటే మన దేశ కరెన్సీలో సుమారు 255 లక్షల కోట్ల రూపాయలు. ఈ సంవత్సరంలో ఇంకా ఇదంతా ఖర్చు చేయని బడ్జెట్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. చైనా ఈ స్థాయిలో ఏర్పాట్లను చేసుకుంది.

రెడీగా ఉందని...
అమెరికా అతి చేస్తే.. ఢీ కొట్టేందుకు తమ దేశం కూడా రెఢీగా ఉందని, వివిధ ప్రణాళికలు, విధాన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని హాంకాంగ్‌కు చెందిన ఆర్థికవేత్త సెరీనా జౌ చెబ్తున్నారు. నిధులను ఇవ్వడం దగ్గరి నుంచి పన్నుల్లో కోత, ప్రోత్సాహకాలు వంటివన్నీ చేయొచ్చని ఆయన చెబ్తున్నారు. ఎందుకంటే చైనాలో అధిక శాతం సంస్థలన్నీ ప్రభుత్వ అధీనంలో, ప్రభుత్వ సంస్థలే ఉన్నాయి. అమెరికా కంటే.. చైనాకే వాళ్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పట్టు కూడా అధికంగా ఉంటుందని మరికొందరు నిపుణులు చెబ్తున్నారు. ఈ నేపధ్యంలో తన బడ్జెట్‌లో ఉన్న నిధులన్నింటినీ అయినా వెచ్చించి అమెరికా ప్రభావం తమ దేశ వృద్ధిపై పడకుండా జాగ్రత్త పడ్తోంది.

అవసరమైతే...
బడ్జెట్ విషయంలో చైనా గత రెండేళ్ల నుంచి ఆచితూచి వ్యవహరిస్తోంది. అవసరమైన వడ్డీ రేట్ కోతలు విధిస్తూనే, ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా జాగ్రత్తపడ్తూ వస్తోంది. కొద్దికాలం నుంచి మౌలిక రంగం, ట్రాన్స్‌పోర్టేషన్, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై భారీగా నిధులను కుమ్మరిస్తూ వస్తోంది. దీని వల్ల ఆ దేశంలో ఉద్యోగాల కల్పనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా వ్యవస్థ ముందుకు సాగుతూపోతుంది.
మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చైనా తన విధాన నిర్ణయాల్లో అనేక మార్పులు చేయొచ్చు. వృద్ధి ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడేందుకు అన్ని దారులూ వెతకొచ్చు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఈ పరిస్థితి నుంచి బయటపడడంలో విఫలమైతే కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ పడ్తుంది. 2021లో జరగబోయే సెంటెనరీ సెలబ్రేషన్స్ (వందో సంవత్సర చైనా ఆవిర్భావ వేడుకలు)పై ప్రభావం ఉంటుంది. ఆ సమయానికి కల్లా చైనాను మరింత పటిష్టంగా మార్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు సఫలీకృతమైనట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకోసమైనా దూకుడుగా ముందుకెళ్లి అమెరికాను ఢీకొట్టేందుకు చైనా రెడీ అవుతోంది. డ్రాగన్ దెబ్బకు ట్రంప్‌కు చూపించాలని ఉవ్విళ్లూరుతోంది.


Click it and Unblock the Notifications