TV9 రవిప్రకాశ్ కోరుకున్న ఇన్వెస్టర్ ఎవరు?
TV9 మాజీ సీఈవో, ఆ చానెల్‌ను కొనుగోలు చేసిన అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ మధ్య వివాదం తెలిసిందే. అయితే అందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
రవిప్రకాశ్ స్వయంగా ఒక కొనుగోలుదారును TV9 పాతయాజమాన్యం అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు పరిచయం చేశాడట. ఆ కొనుగోలుదారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. పెట్టుబడికి లోటులేని కంపెనీ అది.
అదే MEIL అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. తన అనుబంధ పెట్టుబడి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా TV9 ఛానళ్లను కొనుగోలు చేసేందుకు అలంద మీడియాను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలంద మీడియాలో ఒక డైరెక్టరు MEILకు చెందిన మరో రెండు, మూడు కంపెనీల్లోను డైరెక్టరుగా ఉన్నారు.

MEIL యాజమాన్యంతో ఉన్న చనువుతో రవిప్రకాశ్ వారిని TV9 ఛానళ్లను కొనుగోలు చేయాల్సిందిగా ప్రతిపాదించారట. దానికి వారు కూడా సై అనడంతో మిగతా వ్యవహారాలు అన్ని చకచకా సాగిపోయాయి.
కానీ అనుకోకుండా అలంద మీడియాలోకి ఊహించని ప్రముఖ వ్యాపారవేత్త ప్రవేశంతో రవిప్రకాశ్‌కు షాక్ తగిలిందట. అప్పటి వరకు తనకు తిరుగులేదు అనుకొన్న సమయంలో ఆ ప్రముఖుడి ప్రవేశం రవిప్రకాశ్‌ను ఇరకాటంలోకి నెట్టి వేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తాను మైనార్టీవాటాదారు అయినప్పటికీ మేనేజ్మెంట్ కంట్రోల్‌లో ఉంటుందని భావించిన రవిప్రకాశ్.. అనుకోని ప్రముఖుడి ప్రవేశంతో ఇకపై ఇబ్బందులు తప్పవని భావించారని సన్నిహితుల ద్వారా తెలిసింది.


Click it and Unblock the Notifications