ఆటో మొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. భారత్‌లో కార్ల విక్రయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ నెలలో అమ్మకాలు 15.9 శాతం మేర తగ్గాయి. 2018 జులై నుంచి ఆటోమొబైల్ విక్రయాలు తగ్గుతుండటం వరుసగా పదో నెల కావడం గమనార్హం. కొత్త ప్రభుత్వం అనుసరించే ఆర్థిక విధానాలు, రుతుపవనాల ప్రభావం తదితర అంశాలు భవిష్యత్తులో కార్ల అమ్మకాలపై ప్రభావం చూపుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

17శాతం క్షీణించిన అమ్మకాలు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్యాసింజర్ వాహనాలు అమ్మకాలు 17శాతం క్షీణించి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పతనమయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్.. సియోమ్ ప్రకటించింది. నగదు లభ్యత తగ్గడం, బీమా ధరలు పెరగడం అమ్మకాలను దెబ్బతీస్తున్నయని సంస్థ అభిప్రాయపడింది. గతేడాది ఏప్రిల్‌లో 2,98,504 యూనిట్ల్ల ప్యాసింజర్ వాహనాలు అమ్మగా.. ఈ ఏడాది అదే నెలలో విక్రయించిన యూనిట్ల సంఖ్య 2,47,541కి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 16.36శాతం క్షీణించాయి. గత సంవత్సరంలో ఏప్రిల్‌లో 19,58,761 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి ఆ సంఖ్య 16,38,388కి పరిమితమైంది.

15.93శాతం తగ్గిన ఆటోమొబైల్ విక్రయాలు
ప్యాసింజర్, వాణిజ్య, బైక్‌లు తదితర కేటగిరీల వాహన అమ్మకాల్లో 15.93శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది ఏప్రిల్‌లో 23,80,294 యూనిట్ల వాహనాలు విక్రయించగా... ఈ ఏడాది అదే నెలలో ఆ సంఖ్య 20,01,096 యూనిట్లకు పరిమితమైంది. దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారైన మారుతి సుజుకీ డిమాండ్ లేని కారణంగా ఉత్పత్తిలో కోత పెట్టుకుంది.

అర్బన్ ఏరియాల్లో తగ్గిన డిమాండ్
పట్టణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో భారీ తగ్గుదల నమోదైంది. అర్బన్ ఏరియాల్లో స్కూటర్ సేల్స్ 26శాతం మేర పడిపోయాయి. మోటర్ సైకిళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటి అమ్మకాలు 16శాతం మేర తగ్గడం ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపింది.

ఉత్పత్తిలో కోత పెడుతున్న కంపెనీలు
డిమాండ్ తగ్గడంతో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ల ఉత్పత్తిలో కోతకు సిద్ధమయ్యాయి. కార్ల ఉత్పత్తిదారైన మారుతి సుజుకీ.. ప్రొడక్షన్‌లో 10శాతం కోత పెట్టింది. హీరో మోటో కార్ప్, హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఉత్పత్తిలో 15శాతం కోత విధించాలని నిర్ణయించాయి. వచ్చేఆర్థిక సంవత్సరంలోనూ ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి ఊహించిన రీతిలో ఉండక పోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. 2020 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో డిమాండ్ ఫ్లాట్‌గా ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే కొంచెం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications