అదానీ గ్రూప్ విదేశాల్లో మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మయన్మార్‌లోని కంటెయినర్ టర్మినల్‌ను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన అన్ని అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు భారత్‌లోని పోర్టులను తీర్చి దిద్దిన అదానీ సంస్థ ఇప్పుడు విదేశాల్లోని పోర్టులపై కూడా కన్నేసింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలోని ఓ అంతర్జాతీయ పోర్టును అదానీ సంస్థ నిర్మించింది.

ఆంక్షల పరధిలోనే పెట్టుబడులు
ఆస్ట్రేలియా, అమెరికా, ఐక్యరాజ్యసమితిలు మయన్మార్‌పై విధించిన ఆంక్షల పరిధిలోనే ఈ పెట్టుబడులు ఉన్నాయని అదానీ సంస్థ వెల్లడించింది. అంతేకాదు అదానీ సంస్థను సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా గైడెన్స్ కింద పని చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఒప్పందాలు అన్ని ముగిశాక సంబంధిత అధికార యంత్రాంగాలకు పూర్తి సమాచారం చేరవేస్తామని అదానీ సంస్థ తెలిపింది. ఇక పోర్టు నిర్మాణం ప్రతిపాదించిన చోట కావాల్సిన భూమిని మయన్మార్ ఎకనామిక్ కార్పొరేషన్ లీజుకు తీసుకుందని వివరించారు. ఇక ఈ ప్రాజెక్టు కోసం అదానీ సంస్థ 290 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు స్థానిక మీడయా తమ కథనాల్లో పేర్కొంది.

భారత్‌లో ఐదు పోర్టుల నిర్వహణ చూస్తున్న అదానీ
ప్రస్తుతం అదానీ సంస్థ భారత్‌లో ఐదు పోర్టుల నిర్వహణ చూసుకుంటోంది. ఇందులో గుజరాత్‌లోని ముంద్ర, హజీరా పోర్టులు, ముర్ముగావ్‌లో మూడు టర్మినల్‌లు, విశాఖపట్నం, తునా -టేక్రా పోర్టులున్నాయి. తమిళనాడులోని ఎన్నోర్‌లో కంటెయినర్ టర్మినల్ నిర్మిస్తుండగా... కేరళలో విజిన్‌జామ్ పోర్టును నిర్మిస్తోంది. ఇక ఆస్ట్రేలియాలో కూడా పోర్టు నిర్మాణం చేపట్టింది. అదానీ యాంగాన్ ఇంటర్నేషనల్ టర్మినల్ పేరుతో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

పన్ను మినహాయింపు ఇచ్చిన మయన్మార్
ఏప్రిల్ 26న 50 ఏళ్ల నాటి అహ్లోన్ ఇంటర్నేషనల్ పోర్టులోని టర్మినల్-2ను అభివృద్ధి కోసం మయన్మార్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ నుంచి అన్ని అనుమతులు పొందింది. అక్కడి ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు చేసుకుంది. యాంగాన్ నదీ తీరంలో మొత్తం 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది అదానీ సంస్థ. తొలి మూడేళ్లలో ఆదాయపు పన్ను మినహాయింపును మయన్మార్ ప్రభుత్వం కల్పించింది. సెప్టెంబర్‌లో ఈ పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో లక్ష నుంచి లక్షన్నర యూనిట్లు సామగ్రిని హ్యాండిల్ చేసేలా తీర్చి దిద్దుతామని చెప్పిన అదానీ.. ఆ తర్వాత రెండో దశ పనులు ప్రారంభించి మొత్తం 8 లక్షల సామగ్రిని హ్యాండిల్ చేసేలా ఆరునెలల్లో పూర్తి చేస్తామని చెప్పుకొచ్చింది.

స్థానికులకు 1100 ఉద్యోగాలు వచ్చే అవకాశం
ఈ పోర్టు అభివృద్ధి పనులు జరిగితే మయన్మార్ వాణిజ్యం మరింత పెరుగుతుతందని అదానీ సంస్థ అభిప్రాయపడింది. అంతేకాదు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకు రవాణా జరుగుతుందని ఎగుమతి దిగుమతులు కూడా పెరుగుతాయని వెల్లడించింది. ఇక ఈపోర్టు అందుబాటులోకి వస్తే మయన్మార్‌లో ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పిన అదానీ సంస్థ.. స్థానికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 1100 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది.


Click it and Unblock the Notifications