మూర్తి నుంచి కీలక ఆధారాల సేకరణ: రవిప్రకాశ్-శివాజీ అరెస్ట్‌కు రంగం??
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు గైర్హాజరయ్యాడు. అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రయివేటు లిమిటెడ్‌తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్ పైన సైబరాబాద్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టీవీ9 నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో కొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. దీనిపై రవిప్రకాశ్, టీవీ9 మాజీ సీఎఫ్ఓ మూర్తి, సినీ నటుడు శివాజీపై కేసులు నమోదు చేశారు.

అలాంటి వారికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు
ఇందులో భాగంగా పోలీసులు ముగ్గురికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మూర్తి మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యాడు. రవిప్రకాశ్, నటుడు శివాజీ నుంచి స్పందన లేదు. దీంతో ఆదివారం నాడు విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కానీ రనవిప్రకాశ్ హాజరుకాలేదు. దీంతో ఈసారి 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులకే కాకుండా సాక్ష్యులకు కూడా 160 సీఆర్పీసీ నోటీసులు ఇస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగిన ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకుంటేనే 41ఏ సీఆర్పీసీ నోటీసులిస్తారు.

మూర్తి నుంచి కీలక ఆధారాలు సేకరించారా?
160 సీఆర్పీసీ ప్రకారం సాక్షుల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తామని, ఫిర్యాదుదారు పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవం ఉంటే, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేస్తామని, ఈ సెక్షన్ ప్రకారం కోర్టు నుంచి ఎలాంటి వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయవచ్చునని, విచారణలో మూర్తి నుంచి కీలక ఆధారాలు సేకరించామని, అందులో భాగంగానే రవిప్రకాశ్, శివాజీకి సీఆర్పీసీ 41ఏ కింద త్వరలో నోటీసులు జారీ చేస్తామని, దీంతో వారు మరుసటి రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

అరెస్ట్‌కు చాన్స్
రవిప్రకాశ్, శివాజీల కోసం గాలించలేదని, 41ఏ నోటీసులకు స్పందించకుంటే అదుపులోకి తీసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. కాగా, మూర్తి విచారణలో వెల్లడించిన సమాచారం ఆధారంగా రవిప్రకాశ్, శివాజీలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది. రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు సేకరించి ఉంటారని భావిస్తున్నారు. సీఆర్పీసీ 41ఏ నోటీసులకూ రవిప్రకాశ్, శివాజీ స్పందించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications