రుణాల అవకతవకల కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చార్ మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు ఉదయం చందాకొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లు ఢిల్లీలోని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. వారిని అధికారులు ప్రశ్నించారు.

రుణాల అవకతవకల కేసులో చందాకొచ్చార్, దీపక్ కొచ్చార్, ఆయన సోదరుడు రాజీవ్‌లకు గతంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దీపక్, రాజీవ్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు చందాకొచ్చార్, దీపక్‌లు హాజరయ్యారు.
ఈ కేసుకుసంబంధించి ముంబై, ఔరంగాబాద్‌ల్లోని ఉన్న చందా కొచ్చార్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్ వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం ముంబైలోని ఈడీ కార్యాలయంలో వారిని విచారించారు.
ఈ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చార్ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవికి రాజీనామా చేశారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చార్ కుటుంబం లాభపడిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై మనీ లాండరింగ్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications