ఫస్ట్ ప్లేస్ పోయింది, రూ.లక్ష కోట్లు ఎగిరిపోయాయ్ ! పాపం అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి వారం, పది రోజుల ముందు వరకూ తిరుగులేకుండా ఉన్నారు. భారత దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుకెక్కడంతో ఆయన కాలర్ ఎగిరేసుకుని తిరిగారు. కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు దాటడంతో ఊగిపోయారు. కానీ ఒక్కసారిగా బొమ్మ తిరిగబడింది. నాలుగు రోజుల మార్కెట్ పడేసరికి అంబానీకి కూడా కళ్లుతిరిగినంత పనైంది. ఏకంగా నెంబర ఒన్ ప్లేస్ పోవడంతో పాటు రూ.1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఆవిరైపోయింది.

ఏంటా కథ.. ఎందుకా వ్యధ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకూ దేశంలోనే అత్యంత విలువైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థగా రికార్డ్ సృష్టించింది. తన మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లు దాటింది. అయితే స్టాక్ మార్కెట్లో బొమ్మ తిరగబడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నాలుగు రోజుల నుంచి నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు సెషన్లలో ఏకంగా 11 సాతం కోల్పోయింది. దీని విలువ సుమారు రూ.లక్ష కోట్ల వరకూ ఉంది. దీనికి కారణం ఏంటంటే.. విదేశీ మదుపర్లు మార్కెట్ నుంచి సుమారు రూ.2500 కోట్ల విలువైన స్టాక్స్‌ను గత సెషన్లలో వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి తోడు మోర్గాన్ స్టాన్లీ వంటి వివిధ రీసెర్చ్ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌ను డౌన్ గ్రేడ్ చేశాయి. సింపుల్ భాషలో చెప్పాలంటే.. ఇకపై ముకేష్ అంబానీ కంపెనీ అంత దూకుడుతో పరిగెత్తలేదని, ఆదాయ మార్గాలకు బ్రేక్ పడక తప్పదని తేల్చేసింది. ఈ దెబ్బతో స్టాక్ గింగిరాలు కొట్టి రూ.1251 దగ్గర క్లోజైంది.

ఎందుకు కష్టకాలం
రిలయన్స్ ఈ మధ్య ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో కూడా పెట్రోలియం, రిఫైనరీ బిజినెస్‌లలో ఆశించిన వృద్ధిని చూపించలేకపోయింది. కేవలం జియో, రిటైల్ సంస్థల నుంచి వచ్చిన ఆదాయం ఆదుకుంది కానీ.. లేకపోతే మరింత నీరసించేది. ఇక పై వెనిజుయెలా, ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ తగ్గిపోవడం, పాలిస్టర్‌కు డిమాండ్ తగ్గడం వల్ల ఆ ప్రభావం రిలయన్స్‌పై స్పష్టంగా కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా షేల్ గ్యాస్ విషయంలో రిలయన్స్ భారీ ఆశలు పెట్టుకుంది కానీ.. అది బెడిసి కొట్టి సుమారు రూ.14 వేల కోట్ల వరకూ నష్టాన్ని భరించాల్సి కూడా రావొచ్చని ఎనలిస్టులు లెక్కగడ్తున్నారు. ఇలా అన్నీ బేరీజు వేసుకుని చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కొద్దిగా కష్టకాలం ఎదురయ్యేట్టు ఉంది.

టీసీఎస్ రికార్డ్ కొట్టేసింది
ఈ లోపు టాటా కన్సల్టెన్సీ సంస్థ రిలయన్స్‌ను తోసి నెంబర్ ఒన్ స్థానంపైకి ఎక్కింది. ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8.01 లక్షల కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు రూ.7.93 లక్షల కోట్ల వేల్యూకు పరిమితమైంది.


Click it and Unblock the Notifications