విశాఖ పోర్టుకు లాభాల పంట : రూ.200 కోట్ల ప్రాఫిట్
విశాఖపట్టణం : గత ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో విశాఖపట్నం పోర్టు గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఈ మేరకు పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వివరాలు వెల్లడించారు. ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే నీట్ పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు.

రూ.200 కోట్ల లాభం
గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను సైతం సొంతం చేసుకుందని చెప్పారు. 2017-18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018-19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు.

వేగవంతంగా ఆధునీకరణ
85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు.

రక్షణ గోడ నిర్మాణం ..
పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications