రూహ్ అఫ్జా నో స్టాక్.. ! రూ.400 కోట్ల కంపెనీలో కుటుంబ విబేధాలు
రూహ్ అఫ్జా... మన దేశంలో బాగా పాపులర్ అయిన హెల్త్ డ్రింక్. ముఖ్యంగా రంజాన్ మాసంతో పాటు ఎండాకాలంలో ఈ పానీయాన్ని తాగడం మనలో చాలా మందికి తెలుసు. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఈ రూహ్ అఫ్జా ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈ రంజాన్‌లో అత్యధికంగా సేవిస్తారు. ఇఫ్తార్ సమయంలో దీనితోనే తమ ఉపవాస దీక్షని ముగిస్తారు. అయితే గత కొద్దికాలం నుంచి రూహ్ అప్జా దొరకడం లేదు. స్టాక్ అందుబాటులో ఉండడం లేదు. రూ.400 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించిన రూహ్ అప్ఝాలో కుటుంబ విబేధాలే ఈ సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది.

కుటుంబ విబేధాలు
రూహ్ అప్ఝా సిరప్‌ను హందర్ద్ ల్యాబ్స్ తయారు చేస్తోంది. వివిధ ఆయుర్వేద మూలికలకు తోడు రోజా పువ్వు సుగంధంతో ఈ షుగర్ సిరప్‌ను తయారు చేస్తోంది. అయితే గత కొద్ది కాలం నుంచి ఇది అందుబాటులో లేదని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే ప్రమోటర్ కుటుంబం మధ్య విబేధాలే కారణమని తాజాగా తెలుస్తోంది. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం వారం రోజుల్లో సరఫరాను పునరుద్ధరిస్తామని, కొన్ని మూలికలు అందుబాటులో లేకపోవడం వల్లే జాప్యానికి కారణమని కవర్ చేసుకుంటోంది.
వాస్తవానికి ఎలాంటి అప్పూ లేకుండా ముందస్తుగానే డబ్బులు చెల్లించి మరీ రూహ్ అప్జాను డీలర్లు బుక్ చేసుకుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థకు నాలుగున్నర లక్షల మంది రీటైలర్లు అందుబాటులో ఉన్నారు. బ్రాండ్ విలువ కూడా సుమారు రూ.400 కోట్ల వరకూ ఉంటుంది. ఏటా ఈ వేసవికాలంలో అమ్మకాలు 25 శాతం ఎక్కువగా ఉంటాయి.

సరఫరా అందుకే తగ్గిందా?
హందర్ద్ సంస్థను హకీం హఫీజ్ అబ్దుల్ మజీద్ ప్రారంభించారు. ఆయన తర్వాత కొడుకులు, మనవళ్లు సంస్థ బాధ్యతను చూసుకుంటున్నారు. తాజాగా హకీం మనుమడు అబ్దుల్ మజీద్.. అతని తమ్ముడు హమ్మద్ మహ్మద్ మధ్య గొడవలు పెరిగాయి. సంస్థపై హక్కుల కోసం ఇద్దరూ పోరాడుతున్నారు. ఈ ఆధిపత్య పోరులో సంస్థ నిర్వాహణను గాలికొదిలేయడంతో సరఫరా ఇబ్బందులు తలెత్తాయని తెలుస్తోంది.

రూ.1000 కోట్ల మార్కెట్
ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి సిరప్స్ డ్రింక్ మార్కెట్ సుమారు రూ.1000 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. అయితే ఇందులో కూడా 40 శాతానికి పైగా వాటను రూహ్ అప్జా కొల్లగొట్టింది. అంతటి పటిష్ట మార్కెట్‌ను సొంతం చేసుకోవడంతో సక్సెస్ సాధించడంతో పాటు నిరంతరాయంగా తన మార్కెట్‌ను వృద్ధి చేసుకుంటూ వస్తోంది. ఇఫ్తార్‌తో కంపల్సరీ డ్రింక్ కావడంతో ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. గత నవంబర్ నెలలో ఉత్పత్తి ఆగిపోయినట్టు సమాచారం. మళ్లీ ఏప్రిల్ మధ్యలో పునరుద్ధరణ జరిపినా డిమాండ్‌కు తగ్గట్టు సప్లై మాత్రం లేదని తెలుస్తోంది. నెలలునెలలుగా పేరుకుపోయిన పెండింగ్ ఆర్డర్లకు తోడు తాజా సీజన్ నేపధ్యంలో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. యాజమాన్యం మధ్య విబేధాలు కూడా ఉద్యోగుల్లో ఆందోళన పెంచినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications