ఐదో రోజు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల బాటలో నడిచాయి. మిడ్ సెషన్ తర్వాత వచ్చిన అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి నిఫ్టీని పడదోసింది. ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్‌లో వచ్చిన ప్రెషర్... నిఫ్టీని 10500 పాయింట్ల దిగువకు తీసుకుని వచ్చాయి. భారీ వాల్యూమ్స్‌తో సహా స్టాక్స్ పడడం షార్ట్ టర్మ్‌లో ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క ఐటి మినహా అన్ని రంగాల సూచీలూ కుప్పకూలాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ ఒకటిన్నర శాతం వరకూ పడిపోయాయి. నిఫ్ఠీ ఇంట్రాడే నుంచి 170 పాయింట్లు, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు 500 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. ఉదయం పటిష్టంగానే ప్రారంభమైన సూచీలు మిడ్ సెషన్ వరకూ నిలదొక్కుకున్నాయి. నిఫ్టీ 11657 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ వెళ్లింది. అయితే ఆఖర్లో వచ్చిన ఒత్తిడిలో చివరకు 100 పాయింట్లు నష్టంతో 11498 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 38276 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 330 పాయింట్లు దిగొచ్చింది.
హిందుస్తాన్ యునిలివర్, విప్రో, లార్సెన్ అండ్ టూబ్రో, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్, టాటా మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, బిపిసిఎల్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ పడేశాయి
నిఫ్టీలో హెవీ వెయిట్స్ అని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా ఈ రోజు బాగా నీరసించాయి. నిన్నే త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఐసిఐసిఐ.. ఈ రోజు స్థిరంగానే మొదలైంది. ప్రొవిజన్స్ పెరగడం, లాభాలు కరిగిపోవడం వంటి కారణాలతో స్టాక్ ఏకంగా 4 శాతం వరకూ పతనమైంది. చివరకు రూ.386.50 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంట్రాడే పీక్ నుంచి బాగా పడింది. చివరకు 3 శాతం నష్టంతో రూ.1343.50 దగ్గర ముగిసింది.
ఎస్సెల్ గ్రూప్.. మళ్లీ డౌన్
సరైన కారణం ఇంకా తెలియరానప్పటికీ ఉన్నట్టుండి మిడ్ సెషన్ తర్వాత ఎస్సెల్ గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి. ఇంట్రాడేలో జీ ఎంటర్‌టైన్మెంట్ స్టాక్ ఏకంగా 12 శాతం వరకూ పతనమైంది. ఒక్కసారిగా జీ తో పాటు డిష్ టీవీ కూడా కుప్పకూలింది. ఏదో జరిగిపోతోంది అనే కంగారుతో నిఫ్టీ కూడా తత్తరపాటుకు గురైంది. చివరకు పది శాతం వరకూ జీ ఎంటర్‌టైన్మెంట్ కోలుకుని రూ.369 దగ్గర క్లోజైంది. డిష్ టీవీ రూ.32 దగ్గర ముగిసింది.
డీహెచ్ఎఫ్ఎల్.. తీరుమారలేదు
ఒక్క అడుగు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కి అనేట్టు తయారైంది ఈ స్టాక్ తీరు. మళ్లీ వరుస పతనాలతో స్టాక్ కకావికలమవుతోంది. రెండు నెలల కనిష్ట స్థాయికి దిగొచ్చిన స్టాక్ ఈ రోజు మరో 17 శాతం కుప్పకూలింది. గత 12 నెలల కాలంలో స్టాక్ ఏకంగా 80 శాతం దిగొచ్చింది. చివరకు రూ.117 దగ్గర క్లోజైంది.
2 నెలల తర్వాత స్టెరిలైట్‌లో ఉత్సాహం
వేదాంతా దెబ్బతో గత కొద్ది కాలం నుంచి నీరసంగా కదలాడుతూ వస్తున్న స్టెరిలైట్.. ఈ రోజు కాస్త తేరుకుంది. మార్కెట్ ఈ స్థాయిలో పతనమైనప్పటికీ స్టాక్ మాత్రం పెద్దగా పడలేదు. ఇంట్రాడేలో 7 శాతం వరకూ పెరిగింది. చివరకు కేవలం 1 శాతం లాభంతో రూ.193 దగ్గర ముగిసింది.
మారికో.. రన్
ప్రముఖ ఎఫ్ఎంసిజి సంస్థ మారికో మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన నేపధ్యంలో స్టాక్ భారీగా లాభపడింది. ఇంట్రాడేలో సుమారు 8 శాతం వరకూ లాభపడడం ఈ మధ్యకాలంలో ఇదే మొదలు. చివరకు 6 శాతం లాభాలతో స్టాక్ రూ.359 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో హిందుస్తాన్ యునిలివర్, ఫ్యూచర్ రిటైల్ కూడా 1 శాతానికి పైగా లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications