ట్విస్ట్: మేం కాపాడుకుంటాం, మా చేతికివ్వండి: ఉద్యోగుల చేతికి జెట్ ఎయిర్‌వేస్?
జెట్ ఎయిర్వేస్ అంశంలో ట్విస్ట్. నరేష్ గోయల్ తప్పుకున్న అనంతరం ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్‌లను ఆహ్వానించింది. మే 10వ తేదీన ఎవరికి బిడ్ దక్కనుందో తెలియనుంది. ఇందుకు మరో పది రోజుల సమయం ఉంది. ఇదివరకే నరేష్ గోయల్ బిడ్ దాఖలు చేస్తే వ్యతిరేకత రావడంతో దానిని ఉపసంహరించారు. తాజాగా మరో కొత్త ట్విస్ట్. ఏకంగా జెట్ ఎయిర్వేస్‌ను తమకు అప్పగించాలని ఉద్యోగులు రంగంలోకి దిగారు. పైలట్లు, ఇంజినీర్లకు ప్రాతినిథ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు ఎస్‌డబ్ల్యుఐపీ, జేఏఎంఈవీఏ.. ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు లేఖ రాశారు.

మాకు అప్పగించండి
రూ.7,000 కోట్ల మేర నిధులు సమీగరించగలమని, జెట్‌ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. బయటి ఇన్వెస్టర్ల నుంచి రూ.3వేల కోట్లు తీసుకు రావాలని కోరారు. ఎస్‌డబ్ల్యుఐపీలో 800 మంది ఉద్యోగులు, జేఏఎంఈవీఏలో 500 మంది ఉద్యోగుల వరకు ఉన్నారు. తాము బిడ్ దాఖలు చేస్తామని, దానిని పరిశీలించాలని ఎస్బీఐ చైర్మన్‌ను కోరారు. రూ.7వేల కోట్లు సమీకరించగలమని వారు పేర్కొనడం గమనార్హం. ఉద్యోగుల ఫ్యూచర్ ఎర్నింగ్స్, ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్ సహకారంతో రూ.4వేల కోట్లు అంచనా వేశారు. రూ.3వేలు బయట నుంచి తీసుగు రాగలమని పేర్కొన్నారు. ఎనిమిది వేల కోట్లకు పైగా రుణభారంతో జెట్ మూతబడింది. దీంతో దాదాపు 24 వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతలు తమ అప్పులను ఈక్విటీలుగా మార్చుకుని జెట్‌లో 50 శాతానికిపైగా వాటాను పొందారు.

బిడ్ సమయం ముగిసింది కానీ
ఎస్బీఐ చైర్మన్‌కు రాసిన లేఖ పైన ఎస్‌డబ్ల్యుఐపీ జనరల్ సెక్రటరీ అశ్వని త్యాగి, జేఏఎంఈవీఏ ప్రెసిడెంట్ ఆశిష్ కుమార్ మహంతీ, జెట్ ఎయిర్వేస్ మేనేజర్ (హ్యూమన్ రీసోర్సెస్) బీబీ సింగ్, జెట్ లైట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) అకౌంటబుల్ మేనేజర్ పీపీ సింగ్ సంతకాలు చేశారు. ఇప్పటికే బిడ్ దాఖలుకు సమయం ముగిసిపోయింది. కానీ ఉద్యోగులు మాత్రం తమ బిడ్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. వీరు విదేశీ ఇన్వెస్టర్ల సాయం కూడా కోరుతున్నారు. బయటి నుంచి కనీసం రూ.3వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. సహచరులు, గతంలో ఉన్నత పదవుల్లో ఉన్న వారిని కూడా వారు సాయం కోరుతున్నారు. తమకు ఓ అవకాశమివ్వాలని ఈ లేఖలో ఉద్యోగులు కోరారు. బ్యాంకులు, ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పరిశీలించాలని చెప్పారు.

యాజమాన్యం మద్దతు లేదు
కాగా, ఉద్యోగులకు యాజమాన్యం నుంచి మద్దతు లభించడం లేదట. సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్ వెంటే ఇప్పటికీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉండటంతో యాజమాన్యం అండ కరువైందని అంటున్నారు. ప్రస్తుత యాజమాన్యం ఎస్బీఐ నేతృత్వంలో ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బిడ్ పరిశీలనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడిదాక వచ్చిన బిడ్లను ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పరిశీలించనున్నది.


Click it and Unblock the Notifications