1,000మంది ఉద్యోగులు వచ్చారు, మరింత మంది వస్తారు: జెట్‌పై స్పైస్ జెట్ చైర్మన్
ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెట్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా స్పైస్ జెట్ కూడా ఉద్యోగులను తీసుకుంటోందని ఈ సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ అన్నారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు వచ్చారని, మరికొంతమందిని తీసుకుంటామన్నారు.
తమ ఎయిర్‌లైన్స్ మరో ఐదు ఎయిర్ క్రాఫ్ట్స్‌ను పెంచిందని, మరో 40 మందిని తీసుకుంటామని చెప్పారు. విమానయాన సంస్థలకు ఇలా ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఈ పరిశ్రమ దీర్ఘకాలిక సొల్యూషన్స్‌తో ముందుకు వెళ్లాలన్నారు. తాత్కాలికంగా మూతపడటం కూడా బాధాకరమే అన్నారు.
కాగా, ముంబై, ఢిల్లీలకు ఇతర నగరాల నుంచి సర్వీసులు పెంచుతున్నామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి రోజువారీ 28 కొత్త సర్వీసులు ఉంటాయని తెలిపింది. అమృత్‌సర్, జయపూర్, కోయంబత్తూర్‌ల నుంచి ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, హైదరాబాద్, పట్నా, ఢిల్లీ, కోల్‌కతాల నుంచి ముంబైకి మరిన్ని సర్వీసులు నడుపుతామని, మే ఆఖరు నుంచి హాంకాంగ్, జెడ్డా, దుబాయ్, కొలంబో, ఢాకా, రియాద్, బ్యాంకాక్, కాట్మండ్‌కు ముంబై నుంచి సర్వీసులు నిర్వహించనున్నట్లు తెలిపింది.

జెట్‌పై బ్రిటన్ ఇన్వెస్టర్ ఆసక్తి
జెట్ ఎయిర్వేస్‌లో పెట్టుబడి పెట్టేందుకు బ్రిటన్‌కు చెందిన అట్మాస్పియర్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ ఫౌండర్, సీఈవో జాసన్ అన్స్‌వర్త్ ఆసక్తి చూపుతున్నారట. ఈ సంస్థ ఈ సంవత్సరం చివరలో బ్యాంకాక్, దుబాయ్, భారత్‌లకు విమానయాన సేవలు ప్రారంభించనుంది. ఇందుకోసం భారత్, బ్రిటన్, దుబాయ్, థాయిలాండ్‌లలో సీనియర్ నిపుణుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో భాగంగా జెట్‌పై నియంత్రణ వాటా పొందేందుకు ఆసక్తి ఉందని తెలుపుతూ జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబేకు లేఖ రాశారని వార్తలు వచ్చాయి.
దుబే నుంచి తనకు సమాచారం వచ్చిందని, జెట్ సమాచారాన్ని ఇచ్చేందుకు సంస్థలోని ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించారని జాసన్ తెలిపారని తెలుస్తోంది. విమానాశ్రయాల్లో స్లాట్స్ సహా మరిన్ని విలువైన ఆస్తులను జెట్ కోల్పోకముందే, సాధ్యమైనంత త్వరగా ఆ సంస్థ కార్యకలాపాలు పునఃప్రారంభించి, ఉద్యోగులకు వేతనాలు అందేలా చూడాలన్నది తన ప్రణాళిక అని చెప్పారట. జెట్ విలువ మరింత హరించుకుపోకుండా చూడాలని, భారత్‌లోని తమ విభాగానికి జెట్ ఉద్యోగుల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయని చెప్పారు.


Click it and Unblock the Notifications