చైనీస్ ఈ-కామర్స్ బిజినెస్‌ను షట్ డౌన్ చేయనున్న అమెజాన్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ చైనీస్ ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్‌ను క్లోజ్ చేయాలని నిర్ణయించింది. జూలై నెలలో దీనిని పూర్తిగా మూసివేయనుంది. అదే సమయంలో చైనాలో నిర్వహిస్తోన్న ఇతర వ్యాపారాలను మాత్రం కొనసాగించనుంది. అమెజాన్ వెబ్ సిరీస్, కిండ్లే ఈ-బుక్స్ వంటి వాటిని కొనసాగిస్తుంది. జూలై 18వ తేదీ నుంచి అమెజాన్ కస్టమర్లు ఈ వెబ్‌సైట్లోకి ఎంటర్ అయితే థర్డ్ పార్టీ నుంచి కాకుండా గ్లోబల్ స్టోర్ నుంచి ఎంచుకునే అవకాశం మాత్రమే ఉంటుంది.
చైనీస్ ఈ-కామర్స్ మార్కెట్ నుంచి తప్పుకోవడం అమెజాన్‌కు ఇది సెట్ బ్యాక్ అని అంటున్నారు. లోకల్ లీడర్స్ (చైనాకు చెందిన కంపెనీలు) అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ , జేడీ.కామ్.ఇంక్ వంటి వాటితో అమెరికాకు చెందిన టాప్ టెక్ కంపెనీ పోటీ పడేందుకు స్ట్రగుల్ పడుతోందనేందుకు ఇది తాజా ఉదాహరణ అని చెబుతున్నారు.
అమెజాన్ చైనాలోకి 2004లో ఎంటర్ అయింది. అప్పుడు ఇది లోకల్ ఆన్‌లైన్ బుక్ సెల్లర్‌ను 75 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆతర్వాత వేర్‌హౌసెస్, డాటా సెంటర్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది. 2016లో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు దీనిని తీసుకు వచ్చింది. హై క్వాలిటీ వెస్టర్న్ గూడ్స్, ఉచిత ఇంటర్నేషనల్ డెలివరీ వంటి ప్రోత్సాహక హామీలు ఇచ్చింది. ప్రైమ్ వీడియో వంటి వాటితో ఇతర మార్కెట్లలో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ చైనాలో ఇది అందుబాటులో లేదు.

అలీబాబా, జేడీ వంటి చైనీస్ కంపెనీలు ఎన్నో డిస్కౌంట్లతో ఆఫర్లు ఇస్తున్నాయి. అమెజాన్‌కు చైనాలో ఇప్పటి వరకు కనీసం 1 శాతం మార్కెట్ కూడా లేదట. ఇలాంటి వాటిని పక్కన పెట్టి భారత్ వంటి దేశాలపై అమెజాన్ దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇక్కడ ఆధిపత్యం చెలాయించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారట.
గత ఆరేళ్లుగా అమెజాన్ భారత మార్కెట్లోకి బిలియన్ డాలర్లు ప్రవేశపెట్టింది. 50కి పైగా వేర్‌హౌస్‌లు ఉన్నాయి. మరో విషయం ఏమంటే భారత్‌లోను చైనీస్ ఈ-కామర్స్ నుంచి అమెజాన్ పోటీ ఎదుర్కొంటోంది. అలీబాబా వంటి సంస్థలు భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పేటీఎంలో అలీబాబా ఇన్వెస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications