బెజవాడోళ్లకు బ్రేక్‌ఫాస్ట్ అంటే మహా భ్రాంతి: జొమాటో ఇంట్రెస్టింగ్ సీక్రెట్
జొమాటో.. పరిచయం ఏ మాత్రం అక్కర్లేని పేరు. ఆన్‌లైన్ రెస్టారెంట్ లిస్టింగ్ సంస్థగా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు టాప్ ఫుడ్ డెలివరీ సంస్థగా ఖ్యాతిగడిస్తోంది. స్విగ్గీ, ఉబెర్ ఈట్స్‌తో పోటీపడ్తూ తనకంటూ ఓ క్లియర్ ఇమేజ్ బిల్డప్ చేసుకుంది. ఇప్పుడు విషయం ఏంటంటే.. జొమాటో ప్రతీ ఏటా ఓ ఇంట్రెస్టింగ్ డెలివరీ రిపోర్ట్‌ను వెల్లడిస్తుంది. దాని ప్రకారం దేశంలోని ఏ ప్రాంతం ఏ ఫుడ్‌ను బాగా తింటారు, ఏ డిష్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తారు అని తెలియజేస్తుంది.

గుహవటిలో నది దాటాల్సి వచ్చింది
ఇంట్రెస్టింగ్ న్యూస్.. గుహవటిలో ఓ డెలివరీ కోసం డెలివరీ బాయ్ బ్రహ్మపుత్ర నదిని దాటాల్సి వచ్చిందట.
రాజస్తాన్‌లోని అల్వార్ అనే ప్రాంతం నుంచి ఓ వ్యక్తి ఒకేసారి 48 రెస్టారెంట్ల నుంచి 292 పార్సిల్స్ తెప్పించుకున్నాడట.
జైపూర్‌లో ఓ కస్టమర్ ఒకేసారి రూ.1,84,760 విలువైన ఆర్డర్లు ఒకేసారి ఇచ్చాడు. ఇందుకోసం 415 బాక్సులను జొమాటో డెలివర్ చేయాల్సి వచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముంబై కంటే ఇండోర్ నుంచే ఫుడ్ పార్సిల్స్ ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. లేట్ నైట్ ఫుడ్ కోసం ఇండోర్ జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

బ్రేక్ ఫాస్ట్‌లో బెజవాడ టాప్
బ్రేక్‌ఫాస్ట్ విషయంలో బెజవాడ ఇండియా మొత్తాన్ని బీట్ చేసింది. దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని టిఫిన్ ఆర్డర్లు బెజవాడవాసులు ఇచ్చారు.
హైదరాబాద్‌లోని బావార్చీ బిర్యానీ రోజుకు 2000 ఆర్డర్లను జొమాటో ద్వారానే సరఫరా చేస్తోంది.
ఊటీలో యావరేజ్ బిల్ ఎక్కువగా ఉంటే మణిపాల్ కస్టమర్లు ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉందని జొమాటో లెక్కలు చెబ్తున్నాయి. మధురై జనాలు ఎక్కువగా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయడంలో ముందున్నారు.
బీహార్‌లోని గయాలో మోటర్ సైకిళ్ల కంటే సైకిళ్లపై డెలివర్ చేసేందుకు అక్కడి బాయ్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకే బైక్స్ కంటే సైకిల్ నెంబర్ అక్కడ ఎక్కువ.
గుజరాత్‌లోని ఆనంద్‌లో జొమాటో కస్టమర్లు ఎక్కువగా పిజ్జాలను ఆర్డర్ చేస్తే, జమ్మూలో ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్తున్నాయి.
మరో అవాక్కయ్యే విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తునిలో ఫుడ్ డెలివరీస్ సంఖ్య విపరీతంగా పెరిగింది. అంతేకాదు అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ కంటే... ఆన్‌లైన్ పేమెంట్ల సంఖ్య ఎవరూ ఊహించనంత ఎక్కువగా ఉందట.

లిస్టులో లక్ష రెస్టారెంట్లు
గుర్గావ్‌కు చెందిన జొమాటో ప్రస్తుతం 200 నగరాల్లో ఫుడ్‌ను డెలివర్ చేస్తోంది. ఇప్పటివరకూ సుమారు లక్ష రెస్టారెంట్లను తన లిస్ట్‌లో చేర్చుకున్న ఈ సంస్థ మార్చి నాటికి 3 కోట్ల ఆర్డర్లను డెలివర్ చేసింది. వీటివిలువ సుమారు.10,000 కోట్లపైనేనని యాన్యువల్ రిపోర్ట్ చెబ్తోంది. 2018-19లో రూ.1442 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ, దానిపై రూ.2058 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఎందుకంటే ఒక్కో డెలివరీ ఆర్డర్‌పై రూ.25 నష్టాన్ని భరిస్తున్నట్టు జొమాటో చెబ్తోంది.


Click it and Unblock the Notifications