ఇండియాబుల్స్ హోసింగ్ ఫైనాన్స్‌లో లక్ష్మీవిలాస్ బ్యాంక్ విలీనం చేయబోతున్నట్టు ఇరు సంస్థలు శుక్రవారం రోజున బహిరంగంగా ప్రకటించాయి. అక్కడితో ఆగకుండా స్వాప్ రేషియో కూడా వెల్లడించాయి. ఈ సమాచారాన్ని ఎక్స్ఛేంజీలకు అందజేశాయి. దీనిపై ఆర్బీఐ కొద్దిగా సీరియస్ అయింది. ఈ సమాచారాన్ని వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నామని వెల్లడించింది. ఈ విలీనానికి ఇంకా తమ నుంచి అనుమతి పొందలేదనే విషయాన్ని ధృవీకరించింది.
ఆర్బీఐ అనుమతి కష్టమా ?
ఒక బ్యాంక్ మరో సంస్థలో విలీనం కావాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతిని ఇవ్వాల్సి. గత కొన్నేళ్ల నుంచి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ఆర్బీఐ అంత ఉత్సాహాన్ని చూపించడంలేదు. అనేక కఠినతరమైన నిబంధనలను విధించింది. దీంతో రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న సంస్థలు, ఇలాంటి విలీనాల మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇండియాబుల్స్ సంస్థ - లక్ష్మీవిలాస్‌ను టార్గెట్ చేసింది. పేరుకు ప్రైవేట్ బ్యాంక్ అయినా.. విలీనం విషయంలో మాత్రం ఆర్బీఐ అనుమతి అతి ముఖ్యం. ''రెండు సంస్థలూ చేసిన విలీన ప్రకటనకు మా నుంచి ఎలాంటి అనుమతీ లేదు'' అని ఆర్బీఐ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు విబేధించారా ??
ఈ విలీన వ్యవహారంపై లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఎండీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లంతా ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. కానీ బ్యాంకులో ఆర్బీఐ నియమించిన ఇద్దరు అదనపు డైరెక్టర్లు మాత్రం దీనిపై తమకు ఎలాంటి అభిప్రాయమూ లేదని బోర్డ్ మీటింగ్‌లో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని ఆర్బీఐ కూడా ఎత్తి చూపింది. బోర్డులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు దీనిపై తమ అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధపడనప్పుడు ఏ విధంగా ఇది ఏకగ్రీవమవుతుంది అనే ఆర్బీఐ ప్రశ్నిస్తోంది.
మొత్తానికి ఆర్బీఐ పెట్టిన కొత్త మెలిక ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆరేళ్ల క్రితం బ్యాంకింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసిన భంగపడింది ఇండియాబుల్స్ హౌసింగ్.


Click it and Unblock the Notifications