ఇండియా బుల్స్ చేతికి లక్ష్మీ విలాస్
బ్యాంకింగ్ రంగంలో మరో విలీనానికి రంగం సిద్ధమైంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనానికి బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఒప్పందం ప్రకారం ప్రతి 100 ఎల్వీబీ షేర్లకు 14 ఇండియా బుల్స్ కేటాయించనున్నారు. మెర్జర్ అనంతరం కంపెనీకి ఇండియాకి ఇండియాబుల్స్ గ్రూప్ ప్రమోటర్ సమీర్ గెహ్లాట్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఐహెచ్ఎఫ్ ఎండీ గగన్ బంగా, ఎల్‌వీబీ సీఈఓ పార్థసారథి ముఖర్జీ జాయింట్ ఎండీలుగా, హెఐచ్ఎఫ్ ఈడీ అజిత్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

93ఏళ్ల చరిత్రక కలిగిన ఎల్‌వీబీ
తమిళనాడు కరూర్‌కు చెందిన ఏడుగురు వ్యాపారులు 1926లో లక్ష్మీ విలాస్ బ్యాంకును ఏర్పాటు చేశారు. 93ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకు ప్రస్తుత డిపాజిట్లు రూ.30,787 కోట్లు కాగా.. రూ.24,123 కోట్లు రుణాలిచ్చింది. 21.86 లక్షల ఖాతాదారులున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు 19 రాష్ట్రాల్లో 150 నగరాల్లో 569 శాఖలున్నాయి. 4,881 మంది ఉద్యోగులు ఉన్న ఎల్‌వీబీ గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల కాలంలో 630కోట్ల నష్టం నమోదుచేసింది.

హౌసింగ్ ఫైనాన్స్‌లో మూడో స్థానం
ఇండియా బుల్స్ గ్రూప్‌లో భాగమైన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత విలువ రూ.17,792కోట్లు. హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఐహెచ్ఎఫ్ గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో రూ.3,084కోట్ల లాభాలు ఆర్జించింది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ ఇప్పటి వరకు రూ.2.4లక్షల కోట్ల లోన్లు ఇచ్చింది.

విలీనానికి కారణాలు
ఇన్‌ఫ్రా ఫైనాన్స్ మార్కెట్‌లో ఒడిదొడుకుల కారణంగా ఐహెచ్ఎఫ్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు నిధుల సమీకరణ కష్టంగా మారింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ రుణాల మంజూరీ 65శాతం పడిపోయింది. మార్చిలో కాస్త కుదుటపడినా అది సాధారణ స్థాయి కన్నా తక్కువగానే నమోదైంది. మరోవైపు లక్ష్మీ విలాస్ బ్యాంక్ మొండిబాకీలు ఏకంగా 13.95శాతానికి పెరిగిపోగా.. క్యాపిటల్ అడెక్వసీ రేషియో 7.57శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇరు సంస్థలు విలీనానికి మొగ్గుచూపాయి.

ఆర్బీఐ అనుమతి తప్పనిసరి
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జర్‌కు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి విలీనాల్లో బ్యాంకు లైసెన్సును వేరే సంస్థకు బదలాయించేందుకు ఆర్బీఐ అంగీకరించదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో లైసెన్సు ఎల్‌వీబీ పేరు మీదనే కొనసాగించవచ్చని అంటున్నాయి. ఇండియాబుల్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున రియల్టీ, బ్యాంకింగ్ వ్యాపారాల విలీనంపై ఆర్బీఐ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications