2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాను 7.2 శాతానికి తగ్గించిన ఆర్బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వృద్ధి రేటు అంచనాలో కోత విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7.4గా నమోదవుతుందని ఫిబ్రవరిలో ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ అంచనాను 7.2 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను తగ్గించింది.
దేశీయంగా పెట్టుబడులు తగ్గడం, మూలధన వస్తువుల ఉత్పత్తి తగ్గి దిగుమతులు పెరగడం జీడీపీపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక పరిణామాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా అది వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.

వృద్ధి రేటులో కోత విధించిన ఏడీబీ
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని తగ్గిస్తున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 201-20 వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) వృద్ధి రేటు అంచనాని 7.3 శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది.
ఇందుకు స్థానిక, అంతర్జాతీయ అంశాలు కారణమని తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గడం, అధిక చమురు ధరలతో వినియోగ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉండడం ఇందుకు కారణమని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)వృద్ధి రేటు అంచనాను ఏడీబీ 7.6 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. ఏషియన్ డెవల్‌పమెంట్ ఔట్‌లుక్, 2019 పేరుతో బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఏడీబీ ఈ విషయాన్ని తెలిపింది.
2019-20లోను ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుంది. ఆహార వస్తువుల ధరలు, దేశీయ గిరాకీ వంటి వాటి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్భణం 4.3 శాతానికి పెరగవచ్చునని, 2020-21 నాటికి 4.6 శాతంకు చేరవచ్చునని, ఫలితంగా రేట్ల కోత విధించేందుకు ఆర్బీఐకి అవకాశముందని అంటున్నారు.


Click it and Unblock the Notifications