ఆర్బీఐ రెపో రేటు ఎఫెక్ట్: ఊగిసలాటలో మార్కెట్లు, సెన్సెక్స్ స్ట్రగుల్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ రోజు (గురువారం ఏప్రిల్ 4) మధ్యాహ్నం పరపతి విధాన సమీక్షను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ బుధవారం 68.42 వద్ద ముగిసింది. గురువారం 68.53 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9.18 నిమిషాలకు ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 45 పాయింట్ల లాభంతో 38,922 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11,655 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత సెన్సెక్స్ 38,899, నిఫ్టీ 11,643 వద్ద ట్రేడ్ అయింది.
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో 4 శాతం నష్టంతో, అమరరాజా బ్యాటరీస్ 3 శాతం లాభాల్లో, భారతి ఎయిర్‌టెల్ 2 శాతం లాభాల్లో, ఏషియన్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసులు 7 శాతం లాభాల్లో, సియారాం సిల్క్ మిల్స్ 6 శాతం లాభాల్లో, బాంబే డైయింగ్ 6 శాతం లాభాల్లో, డిష్ టీవీ 5 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్ షేర్లు కూడా లాభపడ్డాయి. చైనా, అమెరికా వాణిజ్య పోరుపై చర్చలు సఫలీకృతం కావచ్చనే అంచనాల మధ్య ప్రపంచ మార్కెట్లు కూడా సానుకూలంగానే ట్రేడ్ అవుతున్నాయి.
ఆర్బీఐ గం.11.45 నిమిషాలకు పరపతి విధాన సమీక్షను ప్రకటించనుంది. ద్రవ్య లభ్యత, ద్రవ్యోల్భణం, వర్షాలు, అంతర్జాతీయ పరిస్థితులు, వృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా ఈ ప్రకటన ఉండబోతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఆర్బీఐ రేట్లు తగ్గించినా బ్యాంకులు వాటిని పూర్తిగా బదలీ చేస్తాయా అనేది ప్రశ్నార్థకమే అంటున్నారు. ద్రవ్య లభ్యత సమస్య ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టింది. కానీ సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి సమయంలో రేట్ కట్ వచ్చినా వాటి బదలీ వెంటనే ఉండకపోవచ్చునని, ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
గత ఏడాదిలో ఎఫ్‌డీఐలు భారత్ నుంచి పెద్ద ఎత్తున బయటకు వెళ్లాయి. ఆ తర్వాత తిరిగి మన మార్కెట్లోకి వస్తున్నాయి. కరెంట్ ఖాతా లోటు ఆందోళనకరం కానప్పటికీ అంతర్జాతీయ పరిస్థితుల బాగా లేకుంటే లోటు పెరిగే అవకాశముంది. 2018-19కి గాను భారత్ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలదని డిసెంబర్ పరపతి విధానంలో ఆర్బీఐ అంచనా వేసింది. కేంద్రం 7.2 శాతానికి సవరించింది. అంతక్రితం ఏడాది ఇది 6.7 శాతంగా ఉంది. అంతకంటే ఎక్కువే. కానీ ఫిచ్ రేటింగ్స్ మాత్రం అంతక్రితం ఇచ్చిన ఏడు శాతం అంచనాలను సవరిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ 6.8 శాతం వృద్ధికి పరిమితమవుతుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications