ఏప్రిల్ 4వ తేదీన (గురువారం) ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానం ప్రకటించనుంది. ఇందుకోసం గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏప్రిల్ 2వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటును మరో పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
గత ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటు పావు శాతం తగ్గించింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 4న ఆర్బీఐ తన పరపతి, ద్రవ్య విధానం ప్రకటించనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2019-2020) తొలి ద్రవ్య సమీక్ష ఇది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం దేశీయ వృద్ధి రేటును ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో జీడీపీకి ఊతమిచ్చేందుకు కీలక వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించవచ్చునని భావిస్తున్నారు.

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ స్థాయిలో రుణాలపై వడ్డీ రేట్ల కోతలు పెట్టడం లేదని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి. దీంతో ఆర్బీఐ నిర్ణయాల ప్రయోజనం ఖాతాదారులకు అందకుండా పోతోందంటున్నారు.
ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు శాతం కంటే తక్కువ స్థాయిలో ఉంది. ఫిబ్రవరిలో ఇది 2.57 శాతంగా నమోదు అయింది. అమెరికా, చైనాతో సహా ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు నీరసిస్తోంది. ఈ ప్రభావం మనదేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రమాదం ఉంది. పైగా గత ఏడాది జనవరిలో 7.5 శాతంగా ఉన్న పారిశ్రామిక వృద్ధి సూచి ఈ సంవత్సరం జనవరిలో 1.7 శాతానికి పడిపోయింది. పెట్టుబడులు, వినియోగ వృద్ధి రేట్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీడీపీ వృద్ధి రేటును ఏడు శాతం పైన కొనసాగించాలంటే కీలకమైన వడ్డీ రేట్లు మరింత తగ్గించడమే మార్గమని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications