ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15కు సెన్సెక్స్ 276 పాయింట్ల లాభంతో 38,949 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11,646 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆర్బీఐ పాలసీ విధాన సమీక్ష మార్కెట్లో సానుకూల అంచనాలు నెలకొనడం, మ్యానుఫ్యాక్చరింగ్, సేవా రంగాలకు సంబంధించి మార్చి నెల డేటా విడుదల కానున్న నేపథ్యంలో మార్కెట్ జోరు కనిపించింది. ఈ రెండు రేపు, గురువారం తెలియనున్నాయి.
సెన్సెక్స్ తొలిసారి 39వేల మార్క్‌ను దాటింది. 300 పాయింట్లకు పైగా పెరిగి మొదటిసారి 39,028 మార్కును తాకింది. నిఫ్టీ కూడా 2018 తర్వాత తొలిసారి 11,714 మార్కును దాటింది. లోహరంగ షేర్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటోమొబైల్ సంస్థలు, కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం నాడు 69.15 వద్ద ముగిసింది. సోమవారం ఉదయం 69.33 వద్ద కొనసాగింది.
మరోవైపు, చైనా అమెరికాల మధ్య చర్చలు కొనసాగుతుండటం కూడా కారణం. రెండు దేశాల మధ్య టారీఫ్ వార్ ముగిసే అవకాశముందని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మూడో బ్రెగ్జిట్ బిల్లు కూడ ఆమోదం పొందకపోవడంతో మరో బిల్లుతో సోమవారం(1 ఏప్రిల్) సభ ముందుకు రానున్నారు. ఇదే వారంలో ప్రపంచ వ్యాప్తంగా యూరోజోన్ ద్రవ్యోల్బణం డేటా, చైనా ఉత్పాదక రంగ డేటా, అమెరికా నిరుద్యోగ డేటా కూడా విడుదల కానున్నాయి. దీంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications