డిసెంబర్ బకాయిలు చెల్లిస్తాం: జెట్ ఎయిర్‌వేస్ పైలట్ల అసంతృప్తి
ముంబై: ఇప్పటికిప్పుడు పైలట్లకు శాలరీ డ్యూస్ అన్నీ చెల్లించలేమని, ఇది కుదరదని జెట్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో ఇవ్వలేకపోయిన 87.50 శాతం వేతనాలను మాత్రమే ఇస్తామని తెలిపింది. నాలుగు నెలలుగా తమ వేతనాలు చెల్లించని కారణంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని జెట్ ఎయిర్వేస్ పైలట్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యాజమాన్యం నష్టనివారణ చర్యలు చేపట్టింది. డిసెంబర్ నెలకు చెందిన బకాయిలు చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ దూబే ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖ రాశారు.

సంస్థ కార్యకలాపాల్లో వీలైనంత త్వరగా స్థిరత్వం సాధించడానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నామని, ఇందుకు సంస్థ యాజమాన్యం, డైరెక్టర్ల బోర్డు నిరంతరం ప్లాన్స్ రూపొందించడంలో నిబద్ధతతో పని చేస్తోందని ఈ ప్రక్రియలో కొన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తినందున తాము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోందని, కావు ప్రస్తుతానికి డిసెంబర 2018 వేతన బకాయిలు మాత్రమే చెల్లించగలుగుతున్నామని, ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని, మీ నిబద్ధత గుర్తించిన యాజమాన్యం త్వరలో మరిన్ని నిధులు సేకరించి తదుపరి బకాయిలు చెల్లిస్తుందన్నారు.
దీనిపై ఉద్యోగుల బృందం స్పందించింది. బకాయిలు చెల్లించే నిర్దిష్ట తేదీ చెప్పాలని, అలాగే సంస్థ భవిష్యత్తు ప్రణాళికను కొత్త యాజమాన్యం వెల్లడించాలన్నారు. అప్పుడే విధుల బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచన చేస్తామన్నారు. మార్చి 31లోగా వేతన బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ 1 నుంచి విధులు బహిష్కరిస్తామని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్‌ఏజీ) గత వారం చెప్పింది. అయితే శుక్రవారం వరకు బ్యాంకుల నుంచి విధులు పొందడంలో జెట్ ఎయిర్వేస్ విఫలం కావడంతో నో ఫ్లయింగ్‌కు ఎన్ఏజీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు ఆధారంగా సోమవారం నుంచి విధులకు దూరంగా ఉండేందుకు 1,100 మంది పైలట్ల నిర్ణయం తీసుకున్నారు.
రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్లాన్‌లో భాగంగా ఇటీవలే ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల బృందం చేతికి జెట్ ఎయిర్వేస్ వెళ్లింది. వేతన బకాయిలపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టత లభించకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఎన్‌ఏజీ చోప్రా తెలిపారు.


Click it and Unblock the Notifications