నోట్లను మార్చుకోవడం ఈ రోజుల్లో కాస్త కష్టమైన పనే. ఏ చిన్న రంగు పడినా లేకపోతే వాటిపై ఏదైనా రాసినా బ్యాంకులు ఈ రోజుల్లో వాటిని తీసుకోవడం లేదు. ఏదైనా రంగు పడితే కొన్ని మెషీన్లు ఆ నోట్లను యాక్సెప్ట్ కూడా చేయడం లేదు. మరి ఏం చేయాలి, సదరు నోట్లను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

హోలీ రంగులు పడ్డాయా?
రంగులు పడితే నోట్లు చెల్లవు అనే మాట మార్కెట్లో వినపడ్తూ ఉంటుంది. ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉంది మాట చాలా మందికి తెలియదు. నోట్లపై రంగు పడినా, లేక మట్టి అధికంగా ఉన్నా, రంగుపోయినా, బాగా నలిగిపోయి ఉన్నా నోట్లు చెల్లవంటారు. ఆర్బీఐ ప్రకారం నోట్లపై రంగు ఉన్నా చెల్లుతుంది. అది ఒరిజినల్ నోట్ అయితే దానిపై రంగులున్నా, గీతలున్నా కచ్చితంగా చెల్లే తీరుతుంది. ఆర్బీఐ ఫీచర్స్ ఉన్నంత వరకూ సదరు నోట్లను బ్యాంకులు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే నోట్లపై రంగు పడితే అవి చెల్లవు అని పుకార్లు ఉండడం వల్ల చాలా మంది అలాంటి నోట్లను ఇంటికే పరిమితం చేస్తారు. అవి పెద్ద నోట్లు అయితే తప్ప వాటిని మార్చుకునేందుకు అంతగా ఆసక్తి చూపించారు.

ఆర్బీఐ భరోసా
ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం బ్యాంకులన్నీ నోట్లను స్టాపిల్ చేయకూడదు. పాడైన నోట్లను ఆర్బీఐకి స్టాపిల్ చేయకుండానే పంపించాల్సి ఉంటుంది. నోట్లను కట్టేందుకు కేవలం బ్యాండ్స్‌ను మాత్రమే వాడాలి. పాడైన నోట్లను మార్చుకునేందుకు వీలుగా కొన్ని ఆదివారాలు ప్రత్యేకంగా బ్యాంకులను తెరవాల్సి ఉంటుంది. పాడైన, చిరిగిన నోట్లను బ్యాంకులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఆర్బీఐకి పంపాలి.
అయితే నోట్లపై రాజకీయ పార్టీల నినాదాలు, గుర్తులు, మతాల చిహ్నాలు వంటివి ఉంటే మాత్రం ఆర్బీఐ కూడా వాటిని స్వీకరించదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ మరకలను తుడిచేయడం సాధ్యం కాని పక్షంలో సదరు నోట్లను తీసుకోకపోవడమే మంచిది.

నోట్లను ఎలా మార్చుకోవాలి?
పాత నోట్లను, పాడైన నోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని కౌంటర్లలో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కరెన్సీ చెస్ట్ శాఖలు లేకపోతే ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల దగ్గర మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి ఫార్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒక వేళ నోట్ ముక్కలై ఉంటే ఆ ముక్కల్లో ముఖ్యంగా జారీ చేసిన వ్యక్తి(ఆర్బీఐ గవర్నర్ సంతకం) గ్యారెంటీ, ప్రామిస్ క్లాజ్, మహాత్మా గాంధీ గుర్తు, వాటర్ మార్క్ వంటివి ఉండాలి. ఇవన్నీ ఉంటే నోట్ ముక్కలు ముక్కలుగా ఉన్నా కూడా ఆర్బీఐ వాటిని తీసుకుంటుంది. అయితే ఆర్బీఐ రిఫండ్ రూల్స్ ప్రకారమే వాటికి ఎంత విలువ ఇస్తారో నిర్ణయిస్తారు. బాగా పాడైపోయిన, కొద్దిగా కాలిన, పట్టుకునేందుకు కూడా వీలు లేని స్థితిలో ఉన్న నోట్లను కేవలం ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లోనే మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.


Click it and Unblock the Notifications