జుకర్‌బర్గ్ పోస్ట్‌లనే తొలగించిన ఫేస్‌బుక్, కారణమిదే: తిరిగి వాటిని పొందలేకపోవచ్చు
సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్ ఏకంగా తమ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పోస్టులనే తొలగించింది. ఇది టెక్నికల్ సమస్య కారణంగా జరిగింది. ఈ మేరకు 2007 నుంచి 2008 మధ్య కాలంలో జుకర్‌బర్గ్ చేసిన పోస్టులు డిలీట్ అయినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. టెక్నికల్ సమస్యల కారణంగా కొన్ని సంవత్సరాల క్రితం జుకర్‌బర్గ్ పోస్టులు పొరపాటున డిలీట్ అయ్యాయని, వాటిని తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఆ విషయంలో తాము విజయం సాధిస్తామన్న హామీ లేదని కంపెనీ ప్రతినిధి వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
డిలీట్ అయిన పోస్టులు చాలా ఎక్కువగా ఉండవచ్చునని, వాటి సంఖ్య మీద సరైన అంచనా లేదన్నారు. అంతేకాదు, ఏ పోస్టులు డిలీట్ అయ్యాయో కూడా చెప్పడం కష్టమని కంపెనీ తెలిపింది. ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకున్న ఫేస్‌బుక్‌కు ఇది ఇబ్బందికర పరిణమామమేనని మరో అమెరికన్ మీడియా సంస్థ అభిప్రాయపడింది.

కాగా, ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్, ఫేక్ న్యూస్ ఇష్యూ వంటి ఇష్యూలు కొరకురాని కొయ్యగా మారుతోన్న విషయం తెలిసిందే. అంతకుముందు, ఫేస్‌బుక్ సమాచార భద్రతా ఉల్లంఘన వివాదం లేక కేంబ్రిడ్జి అనలెటికా వివాదం అన్నది ఫేస్‌బుక్ తమ వినియోగదారుల సమాచారాన్ని ఎన్నికల్లో వారిని రాజకీయంగా ప్రభావితం చేసే ఉద్దేశాలున్న సంస్థలకు అమ్ముకుని దుర్వినియోగం చేసిందన్న అంశంపై వివాదం జరిగింది. కేంబ్రిడ్జి అనలిటికా అన్న రాజకీయ సమాచార విశ్లేషణ సంస్థకు ఫేస్‌బుక్ ఐదు కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అమ్మిందని, ఆ సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వ ప్రచారానికి అనుకూలంగా ఉపయోగించిందన్న విషయం 2018లో బహిర్గతమైందని వార్తలు వచ్చాయి. ఒక ఫేస్‌బుక్ యాప్ వినియోగించినవారి సమాచారంతో పాటు, వారి స్నేహితుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా కేంబ్రిడ్జి అనలిటికా అనుమతి లేకుండా సేకరించడాన్ని ఫేస్‌బుక్ ఏపీఐల ద్వారా అవకాశమివ్వడం విమర్శలకు కారణమైంది.


Click it and Unblock the Notifications